ఇందిరమ్మ ఇల్లు ఇక రాదని.. | Man Dies in Rangareddy district | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇల్లు ఇక రాదని..

May 31 2025 3:13 AM | Updated on May 31 2025 3:13 AM

Man Dies in Rangareddy district

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య 

రంగారెడ్డి జిల్లా చింతపట్లలో ఘటన

యాచారం: ఇందిరమ్మ ఇల్లు తనకు ఇక రాదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్‌ (45) ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఆయనకు ఇంటి స్థలం లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు అర్హుడైనప్పటికీ స్థలం లేకపోవడంతో మొదటి విడతలో ఇల్లు మంజూరు కాలేదు. ఈ నెల 23న స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి యాచారంలో లబి్ధదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసే సమయంలో లిస్టులో తన పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ రోజు నుంచి మనోవేదనకు గురయ్యాడు. ‘స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యేకు చెప్పుకొందామంటే కలవనీయరు. పిల్లలు పెద్దవుతున్నా సొంత ఇల్లు లేదాయే’అంటూ కొద్ది రోజులుగా ఇక తాను చస్తానని గ్రామస్తులతో చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఇల్లు రాకపోవడానికి, తన చావుకు కారణం స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు, తన బావ యాదయ్యనేనని చేతిపై రాసుకుని శుక్రవారం ఉదయం అద్దెకుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్దామనే సరికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.  

మృతదేహంతో ఆందోళన  
అశోక్‌ మృతికి సర్కారే కారణం అంటూ అతని కుటుంబీకులు, గ్రామస్తులు మృతదేహంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ నందీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ అయ్యప్ప, ఎంపీడీఓ శైలజ గ్రామానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి సూచన మేరకు మృతుడు అశోక్‌ కుటుంబానికి గ్రామంలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ముగ్గురు కూతుళ్ల చదువు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని తహసీల్దార్‌ అయ్యప్ప హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.

Advertisement
 
Advertisement
Advertisement