నిరుద్యోగ యువతపై బీఆర్‌ఎస్, బీజేపీ దృష్టి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై అన్ని రాజకీయ పార్టీలు గురిపెట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని గెలుచుకుని తీరాలని అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, సిట్టింగ్ సీటు చేజారి పోకుండా చూసుకోవాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్, ఈ స్థానంలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఆరు నెలల ముందు నుంచే ఆయా పార్టీలు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. ప్రస్తుత పట్టభద్రల ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పదవీ కాలం వచ్చే మార్చి 27తో ముగియనుంది. మార్చి 29లోగా ఈ స్థానానికి మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు పట్టభద్రులను మచ్చిక చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాలుగు రోజుల క్రితం ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై గ్రాడ్యుయేట్లపై దృష్టిసారించాల్సిందిగా సూచించారు. ఎన్నికల సమరానికి అవసరమైన గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా ఆశావహులకు సూచించారు.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌కు అవకాశం
ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఎన్నికలు నిర్వహించారు. 93 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 88,358 మంది ఓటర్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 77,349, హైదరాబాద్‌లో 64,224 మంది ఓటర్ల చొప్పున మొత్తం 5,31,268 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. వీరిలో 3,57,354 మంది (67.26 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవికి 1,12,689 మొదటి ప్రాధాన్యత ఓట్లు, 36,580 రెండో ప్రాధాన్యత ఓట్లు దక్కాయి. ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన ఎన్.రాంచందర్‌రావుపై 1,49,298 ఓట్లతో గెలుపొందారు. ఇదిలా ఉంటే పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమానికి సెప్టెంబర్ 20 నుంచి 30 మధ్యన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 30 వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం ఉండనుంది. తర్వాత మార్చి 29లోపు ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఈసారి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య ఏడు లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా.
‘హస్త’ంలో ఆశావహుల మధ్య పోటీ
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా ఈ సీటును హస్తగతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మేరకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బలమైన నేతను బరిలోకి దించాలని యోచిస్తోంది. పట్టభద్రులు, నిరుద్యోగులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగి ఉన్న ఇంజనీరింగ్, ఇతర విద్యా సంస్థలను కలిగి ఉన్న బలమైన నేతను రంగంలోకి దించాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు పీసీసీ అధికార ప్రతినిధి గౌరిసతీష్ సహా జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డికి సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. వీరు ఇప్పటికే ఓటర్ల నమోదుపై దృష్టిసారించినట్లు సమాచారం. మరికొంత మంది ఆశావహులు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు.
2027లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక
ఇప్పటి నుంచే ప్రధాన పార్టీల కసరత్తు
మొదలైన గెలుపు గుర్రాల వేట
గ్రౌండ్‌వర్క్ చేసుకోవాలని ఆశావహులకు సూచన
ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలపైనే ఫోకస్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో విద్యార్థి, నిరుద్యోగలకు ఇచ్చిన హామీలు.. తర్వాత ఆ పార్టీ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్‌నగర్ వేదికగా ‘యువ సంగ్రామ’ సదస్సు నిర్వహించి.. కాంగ్రెస్ పార్టీ యువతకు చేసిన మోసాలను ఎండగట్టారు. విద్యార్థి, నిరుద్యోగ యువత మద్దతను పెద్ద సంఖ్యలో కూడగట్టి సిట్టింగ్ సీటును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ సురభివాణిదేవి మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. ఆమె స్థానంలో బలమైన విద్యార్థి ఉద్యమ నేతను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇక బీజేపీ సైతం ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతను రంగంలోకి దింపాలని భావిస్తోంది.


