ఇబ్రహీంపట్నం: రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఫార్మా భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. గ్రీన్ ఫార్మాసిటీకి భూములిచ్చిన మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 387 మంది రైతులకు మంగళవారం ఇబ్రహీంపట్నంలో ఇళ్ల స్థలాల కన్వీయన్స్ డీడ్ పత్రాలను పంపిణీ చేశారు. ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఫార్మాసిటీకి తీసుకున్న భూములకు ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలు మాత్రమే ఇచ్చిందని, అందులోనూ బీఆర్‌ఎస్ నాయకులే దళారులుగా వ్యవహరించి నష్టపరిహారం పూర్తిగా అందకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఐదెకరాలు తీసుకుంటే రెండు ఎకరాలకే పరిహారం చెల్లించి అన్యాయం చేశారన్నారు. తాము మొత్తం 3,027 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, మొదటి విడతగా 387 మందికి ఇప్పుడు పత్రాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాపల్లి గురునాథ్‌రెడ్డి, సర్పంచ్‌లు సుగుణమ్మ, చైతన్య, జాన్సీ, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


