ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్‌ శాస్త్రి కన్నుమూత

Malladi Chandrasekhara Sastry Passed Away - Sakshi

వయోభారంతో ఇంట్లోనే తుది శ్వాస.. నేడు అంత్యక్రియలు 

సాక్షి, హైదరాబాద్‌: మహామహోపాధ్యాయ, పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస బిరుదాంకితులు, ప్రముఖ పురాణ వేదశాస్త్ర పండితులు, ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి స్వస్థలం గుంటూరు జిల్లా క్రోసూరు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్నలక్ష్మి, ఆరుగురు కుమారులు రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఇద్దరు కుమార్తెలు ఆదిలక్ష్మి, సరస్వతి ఉన్నారు. చంద్రశేఖర శాస్త్రి భాతిక కాయానికి శనివారం బన్సీలాల్‌ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లాది కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
చంద్రశేఖర శాస్త్రి మరణంపట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలను అవపోసన పట్టిన మహా పండితుడు ఆయనని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తీవ్రంగా బాధించింది: కిషన్‌రెడ్డి 
మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెందడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top