మ్యాంగో.. ఫ్లవర్‌..స్టిక్‌ | Lorry driver who gave cannabis codewords based on quality | Sakshi
Sakshi News home page

మ్యాంగో.. ఫ్లవర్‌..స్టిక్‌

Jul 3 2026 2:48 AM | Updated on Jul 3 2026 2:48 AM

Lorry driver who gave cannabis codewords based on quality

క్వాలిటీనిబట్టి గంజాయికి కోడ్‌వర్డ్స్‌ పెట్టిన లారీడ్రైవర్‌

వాట్సాప్, టెలిగ్రాం యాప్స్‌ ద్వారా ఆర్డర్లు 

స్పీడ్, ఇండియా పోస్టు ద్వారా సరఫరా 

దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ 

గుట్టురట్టు చేసిన హెచ్‌–న్యూ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: గంజాయి సాగు చేసే లారీడ్రైవర్‌ సత్యం మిశ్రా దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నాడు... మరో నలుగురితో కలిసి ముఠా కట్టి స్పీడ్, ఇండియా పోస్టు ద్వారా సరుకు సరఫరా చేస్తున్నాడు... గంజాయి క్వాలిటీని బట్టి మ్యాంగో, ఫ్లవర్, స్టిక్‌ అనే కోడ్‌వర్డ్స్‌ పెట్టాడు... సోషల్‌మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, యూపీఐ విధానంలో నగదు అందుకుని దందా చేస్తున్న సత్యం ముంబై కోసంప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించిన హెచ్‌–న్యూ పోలీసులు సత్యంను అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్‌ సజ్జనర్‌ గురువారం ప్రకటించారు. డీసీపీ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.  

అలవాటుపడి... వృత్తిగా మార్చుకుని...
జార్ఖండ్‌కు చెందిన సత్యం మిశ్రా ఇంటర్మీడియట్‌ను మధ్యలోనే ఆపేసి పెయింటర్‌గా మారాడు. ఆపై డ్రైవింగ్‌ నేర్చుకుని లారీ డ్రైవర్‌గా వివిధ రాష్ట్రాలకు వెళ్లివచ్చే వాడు. తరచుగా ముంబై వెళ్లే సత్యానికి 2018లో అక్కడే గంజాయి వినియోగం అలవాటై బానిసగా మారాడు. ఇలా పలువురు వినియోగదారులతో సంబంధాలు ఏర్పడ్డాక తానే ఆ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. 

తన సోదరుడు శుభం మిశ్రాతో కలిసి స్వగ్రామమైన తాంబగుడియాలో గంజాయి పండించడం మొదలెట్టాడు. బంధువు సచిన్‌ మిశ్రా, స్నేహితులు ఛోటా మిశ్రా, సంతోష్‌ పండిట్‌లతో కలిసి ముఠా కట్టాడు. గ్రామంలో పలువురిని గంజాయి పండించేలా ప్రేరేపించాడు. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్తాన్, జార్ఖండ్, ఢిల్లీ సహా 21 రాష్ట్రాల్లో ఇతడికి కస్టమర్లు ఉన్నారు.  

డాక్టర్‌నంటూ.. ఔషధాల పేరుతో... 
వాట్సాప్, టెలిగ్రాం యాప్స్‌ ద్వారా ఆర్డర్లు తీసుకునే సత్యం క్వాలిటీని బట్టి గంజాయికి మ్యాంగో, ఫ్లవర్, స్టిక్‌ అనే పేర్లు పెట్టాడు. ఒక మ్యాంగో అంటే 50 గ్రాములు అని లెక్క. ఇలా రూ.1500 నుంచి రూ.8 వేల వరకు విక్రయించే వాడు. ఆ మొత్తాన్ని యూపీఐ విధానంలో అందుకునే వాడు. సత్యం ముఠాకు చెందిన ఛోటే మిశ్రా డాక్టర్‌ రాహుల్‌ ఝా అవతారం ఎత్తాడు. సత్యం, శుభం మిశ్రా సిద్ధం చేసిన గంజాయి పార్శిల్‌ను తమ సమీపంలో ఉన్న ఇస్రీ బజార్, ఫుస్రో బజార్‌ పోస్టాఫీసులకు తీసుకువెళ్లేవాడు. 

ఔషధాల పేరుతో పార్శిల్‌ ఇస్తూ పోస్టాఫీస్‌ సిబ్బందికి అనుమానం రాకుండా ఒక్కోసారి ఒక్కో చోట నుంచి కస్టమర్‌కు పంపేవాడు. స్పీడ్‌పోస్టు, ఇండియా పోస్టు విధానాలను వినియోగించే సత్యం సరుకు సరఫరా చేసేవాడు. ముంబై నెట్‌వర్క్‌ను పర్యవేక్షించే సచిన్‌ మిశ్రా, సంతోష్‌ పండిట్‌ అక్కడ పర్సనల్‌ డెలివరీ ప్రారంభించారు. దాదాపు వెయ్యి మంది కస్టమర్ల నుంచి సత్యంకు వచ్చే ఆర్డర్ల ఆధారంగా వారి వద్దకు వెళ్లి సరుకు ఇచ్చి వచ్చేవాళ్లు. ఇలా సత్యం రూ.ఏడాదికి సుమారు రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ చేస్తూ రూ.2 కోట్ల వరకు ఆర్జించాడు.  

గుడిమల్కాపూర్‌లో చిక్కిన ఆధారం... 
జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్‌ పోస్టాఫీస్‌ నుంచి గుడిమల్కాపూర్‌కు ఇటీవల ఓ పార్శిల్‌ వచ్చింది. ఆ వెంటనే ఫుస్రో బజార్‌ పోస్టాఫీస్‌ నుంచి ఎస్సార్‌నగర్‌కు మరో పార్శిల్‌ రావడంపై హెచ్‌–న్యూకు సమాచారం అందింది. దీనిపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్లు బాలస్వామి, నాగార్జున, తమ ఎస్సై మనోజ్‌ కుమార్, ఏఎస్సైలు చక్రపాణి, సుబ్బారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఉమాశంకర్‌తో కలిసి రంగంలోకి దిగారు. ఈ రెండు పార్శిల్స్‌ అందుకున్న సుశాంత్‌ వ్యాస్, లడ్డూ్డలను అదుపులోకి తీసుకుని రెండు కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో జార్ఖండ్‌లో సత్యంను అరెస్టు చేసి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement