ఆశల పల్లకీలో ఎంఎస్‌ఎంఈలు | Loans of up to Rs 10 crore without collateral security | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకీలో ఎంఎస్‌ఎంఈలు

Feb 2 2025 4:45 AM | Updated on Feb 2 2025 4:45 AM

Loans of up to Rs 10 crore without collateral security

మారిన నిర్వచనంతో సూక్ష్మ,చిన్న పరిశ్రమల పరిధి విస్తృతం 

కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా రూ.10 కోట్ల వరకు రుణాలు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ 2025–26 బడ్జెట్‌ ప్రతిపాదనలు రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్‌ఎంఈ) ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈల పరిధిని కొత్తగా నిర్వచించడంతోపాటు రుణ పరిమితిని రెట్టింపు చేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలో ఎంఎస్‌ఎంఈలకు దేశవ్యాప్తంగా రూ.లక్షన్నర కోట్లు అదనంగా రుణాలు లభించే అవకాశం ఏర్పడింది. తెలంగాణలోనూ రుణ లభ్యత పెరగడంతోపాటు కొత్తగా అనేక సంస్థలు ఎంఎస్‌ఎంఈల పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలో 2015 నాటికి 26.05లక్షల ఎంఎస్‌ఎంఈలు ఉండగా, టీజీ ఐపాస్‌ పోర్టల్‌లో నమోదవుతున్న వివరాల ప్రకారం వీటి వృద్ది రేటు 11 నుంచి 15 శాతం వరకు ఉంటోంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనే 40శాతం మేర ఉన్నాయి.

ఎంఎస్‌ఎంఈలతో సుమారు 33లక్షల మంది ఉపాధి పొందుతుండగా, సేవలు, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఖనిజాధారిత పరిశ్రమల్లోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలు భూమి, నిధులు, ముడి సరుకులు, కార్మికులు, సాంకేతికత, సరైన మార్కెటింగ్‌ వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిధుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లే ఎంఎస్‌ఎంఈలు కొల్లేటరల్‌ సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎంఎస్‌ఎంఈ రుణాల కోసం డిమాండ్‌ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. నిర్వహణ వ్యయం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నా సరైన సమాచారం లేకపోవడం, ఇతర నిబంధనలతో సకాలంలో ఎంఎస్‌ఎంఈలకు నిధులు అందుబాటులోకి రావడం లేదు. కొల్లేటర్‌ సెక్యూరిటీ లేకుండా రుణపరిమితిని రెట్టింపు చేసి రూ.10 కోట్లకు పెంచారు.

ప్రగతిశీల, పురోగామి బడ్జెట్‌ 
ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక అనుకూల ప్రగతిశీల, పురోగామి బడ్జెట్‌ ఇది. టారిఫ్‌ రేట్ల విధానంలో మార్పులతో దేశీయంగా తయారీ రంగానికి ఊతం లభిస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘జాతీయ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌’ద్వారా లిథియం, కోబాల్ట్‌ వంటి అనేక ఖనిజాలు దేశ ఆర్థిక  పురోగతిలో కీలకంగా మారడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. తద్వారా లిథియం, ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీల తయారీని ప్రోత్సహిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ బడ్జెట్‌ ఎంతో ఉపయోగకరం. నైపుణ్య శిక్షణ రంగానికి కూడా బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. –సురేశ్‌ కుమార్‌ సింఘాల్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు  

నిధుల లభ్యత పెరుగుతుంది 
ఎంఎస్‌ఎంఈల్లో సులభతర విధానాలకు బాటలు వేసేలా బడ్జెట్‌ ఉంది. రుణ లభ్యత పెరగడంతో రూ.5 లక్షల విలువ చేసే క్రెడిట్‌ కార్డులను 10 లక్షల మందికి జారీ చేయాలనే నిర్ణయాన్ని ఆహా్వనిస్తున్నాం. ఇది ఎంఎస్‌ఈలకు నిర్దేశిత వడ్డీపై ఎప్పుడైనా రుణ మొత్తాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతి సులభతరమవుతుంది. స్టార్టప్‌ల రుణ పరిమితి కూడా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడాన్ని ఆహా్వనిస్తున్నాం. 
– కొండవీటి సుదీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement