రెండ్రోజులు తేలికపాటి వర్షాలు | Light rains for two days in telangana | Sakshi
Sakshi News home page

రెండ్రోజులు తేలికపాటి వర్షాలు

Jun 4 2026 4:02 AM | Updated on Jun 4 2026 4:02 AM

Light rains for two days in telangana

చాలా ప్రాంతాల్లో తేలికపాటి, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

చురుకుగా నైరుతి రుతుపవనాలు... నేడు కేరళను తాకే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 నుంచి 1డిగ్రీ సెల్సియస్‌ మేర తక్కువగా నమోదయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తోందని, రానున్న నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉడికిన రాష్ట్ర ప్రజలకు ఐఎండీ తాజా సూచన కాస్త ఉపశమనం ఇచ్చినట్లైంది. 

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తర తమిళనాడు వరకు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది.నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

గురువారం కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆగ్నేయ అరబిక్‌ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అలాగే నైరుతి, పశ్చిమ–మధ్య, తూర్పు– మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి గురువారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.0 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement