సుమారు రూ.9 వేల కోట్లకు పైగా ఆదాయమే లక్ష్యం
ఐటీ సెజ్ రద్దుతో 90 ఎకరాలకు పైగా అందుబాటులోకి
వ్యాపార దిగ్గజ సంస్థలకు కొంగు బంగారంగా కోకాపేట్ భూములు
సాక్షి, హైదరాబాద్: సర్కార్‌కు పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపిస్తున్న కోకాపేట్‌లో మరో భారీ వెంచర్ కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు గతంలో ఐటీ సెజ్ కోసం కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకొనేందుకు (సెజ్ డీనోటిఫై) చర్యలు చేపట్టింది.
అప్పట్లో సుమారు 117 ఎకరాలను ఐటీ సెజ్ కోసం కేటాయించారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే ఇక్కడ భూమిని కొనుగోలు చేశాయి. ప్రస్తుతం 90 ఎకరాలకు పైగా అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ భూములనే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంతకాలంగా కోకాపేట్ భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నగరానికి పడమటి వైపున ఐటీ తదితర వ్యాపార సంస్థలు కొలువుదీరి కోకాపేట్ భూములు వ్యాపార, రియల్ దిగ్గజ సంస్థలకు కొంగుబంగారంగా మారాయి. ఎకరం రూ.వంద కోట్లపైనే అమ్ముడవుతుంది. ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లోనూ ఎకరం గరిష్టంగా రూ.151 కోట్లకు అమ్ముడైంది.
సగటున రూ.142 కోట్లకు ఎకరం చొప్పున విక్రయించారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సెజ్ హోదాను డీ నోటిఫై చేయడం ద్వారా భూముల విక్రయానికి మార్గం సుగమం కానుంది. ఎకరం సగటున రూ.వంద కోట్ల చొప్పున అమ్ముడైనా ఈ భూముల ద్వారా సుమారు రూ.9 వేల కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట్ నియోపొలిస్, గోల్డ్‌మైల్ తదితర లే అవుట్‌లలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు అనూహ్య స్పందన లభించింది.
మౌలిక సదుపాయాలతో వెంచర్...
కేంద్రం ఐటీ సెజ్ హోదాను రద్దు చేసిన వెంటనే అన్ని మౌలిక సదుపాయాలతో వెంచర్‌ను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నియోపోలిస్ వెంచర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. కొత్త వెంచర్‌ను సైతం ఇలాగే అభివృద్ధి చేయనున్నారు.


