జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కింగ్ మేకర్‌గా మిగలబోదని, కింగ్ గానే విజయం సాధిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరగనున్నందున, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి గెలుస్తారనే నమ్మకం తమకుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా జూబ్లీ హిల్స్‌లో పార్టీ విజయానికి తనదే బాధ్యత అని, తెలంగాణలో రాజకీయాలకు బీజేపీ కేంద్ర బిందువుగా మారబోతోందని అన్నారు. 
ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు తెలిపారని చెప్పారు. సోమవారం కిషన్‌రెడ్డి బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉప ఎన్నికకు పాకిస్తాన్‌కు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్సు తప్ప ఇంకే హామీ అమలు చేయలేదని, అలాంటిది కాంగ్రెస్‌ను గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని సీఎం బెదిరించడం ఏమిటని నిలదీశారు. 
ఆరు గ్యారంటీలు, 421 హామీలను అమలు చేయని రేవంత్‌ను ప్రజలెందుకు నమ్మాలని ప్రశ్నించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. మహిళలు రోజూ పొద్దున్నే పనులు పూర్తి చేసుకుని ‘విండో షాపింగ్’(ఏమీ కొనకుండానే) చేసి తిరిగి వచ్చేందుకు ఉచిత బస్సు సదుపాయం ఉపయోగపడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు.  
ఏప్రిల్ 1 నుంచి జనగణన షురూ.. 
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన మొదలై 2027 ఫిబ్రవరి 28న ముగుస్తుందని సెన్సెస్ కమిషనర్ ప్రకటించారని కిషన్‌రెడ్డి తెలిపారు. తొలిదశలో ఇళ్ల వారీగా జనాభా లెక్కలు, కులాల వారీగా సమాచారం సేకరిస్తారని, వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్‌గా పంపించే వీలు కూడా కల్పిస్తున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన వారికి మంత్రి పదవి ఇచ్చిన పార్టీ నేత కేటీఆర్.. ఫిరాయింపులపై కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, ఖైరతాబాద్ స్థానంలోనూ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో తమ పార్టీపరంగా కేసు దాఖలు చేశామని తెలిపారు. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో మొదటి విడత ఇస్తామన్న రూ.600 కోట్లు వెంటనే ఇవ్వాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
