పొలం.. కదలని హలం! | Kharif cultivation was worse by severe rain shortage | Sakshi
Sakshi News home page

పొలం.. కదలని హలం!

Jun 23 2026 5:57 AM | Updated on Jun 23 2026 5:58 AM

Kharif cultivation was worse by severe rain shortage

తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్‌ సాగు కుదేలు 

జూన్‌ మూడో వారంలోనూ పొలాల్లో సందడి కరువు

నిరుటితో పోలిస్తే నాలుగో వంతుకూ చేరని పంటల సాగు విస్తీర్ణం 

ఇప్పటివరకు 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి, 5.43 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి 

మొక్కజొన్న, కంది పంటల సాగూ అంతంతే 

మొత్తంగా ఇప్పటివరకు 6.5 లక్షల ఎకరాల్లోనే పంటలు 

నిరుడు ఇదే సమయంలో 26 లక్షల ఎకరాల్లో సాగు

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ సీజన్‌లో పల్లెల్లో తెల్లవారుజామునే వినిపించే ట్రాక్టర్ల శబ్దాలు ఇప్పుడు అంతగా లేవు. నాగళ్లు భుజాన వేసుకుని వెళ్లే రైతులూ లేరు. నాగలి సాళ్లు పడాల్సిన పొలాల్లో అనేకచోట్ల ఇంకా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. జూన్‌ మూడో వారం ముగుస్తున్నా చాలాచోట్ల భూములింకా బీడుపడే కనిపిస్తున్నాయి. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వాన రాకకోసం నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా తొలకరి జల్లులతో పత్తి విత్తనాలు వేసిన వారు మొలకలు రాక దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, అక్కడక్కడా అడపాదడపా కురిసిన చిరు జల్లులు కూడా నిలకడగా లేకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 132 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల ఎకరాల్లో పంటలు వేశారంటే..ప్రస్తుతం సాగులో ఎంత జాగు చోటు చేసుకుందో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఖరీఫ్‌ ప్రధాన పంటగా మారిన వరి సాగు ఈసారి దాదాపు నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. జూన్‌ మూడో వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు లేదా విత్తనాలు వేయగలిగారు. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 59 వేల ఎకరాల్లో వరి సాగు ప్రారంభం కావడం గమనార్హం. 

వరి నాట్లు వాయిదా 
సాధారణంగా జూన్‌ రెండో వారం నుంచే నారుమళ్లు సిద్ధమై, అనేక ప్రాంతాల్లో నాట్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి వర్షాలు లేకపోవడం, చెరువులు, కుంటలు, బోర్లు కూడా ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో రైతులు నాట్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసినా పొలాల్లోకి దిగలేకపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా తగినంత వర్షపాతం నమోదయ్యే వరకు రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని సూచిస్తున్నారు. 

మొలకెత్తని పత్తి.. 
రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంట పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు 5.43 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. అయితే వీటిలో సగానికి పైగా విస్తీర్ణంలో విత్తనాలు మొలకెత్తలేదని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జూన్‌ ప్రారంభంలో తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఆశగా విత్తనాలు వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో నేలలో తేమ తగ్గిపోయి గింజలు ఎండిపోయాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్‌ తదితర కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 50 శాతం వరకు మాత్రమే మొలకలు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు పురోగతిలో ఉండగా, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 

కుప్పకూలిన సోయా సాగు  
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే సోయాబీన్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 6,735 ఎకరాల్లో మాత్రమే సోయాబీన్‌ విత్తనాలు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1,15,069 ఎకరాల్లో సోయాబీన్‌ సాగు జరిగింది. అంటే సుమారు 94 శాతం మేర విస్తీర్ణం తగ్గిపోయింది. సోయాబీన్‌కు విత్తే సమయంలో నేలలో సరిపడా తేమ అవసరం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు విత్తనాలను నిల్వలోనే ఉంచుతున్నారు.  

మొక్కజొన్న, కంది పంటలకూ బ్రేక్‌  
వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది పంటల సాగు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 11 వేల ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 80,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు నమోదు కావడం గమనార్హం. అలాగే కంది పంట నిరుడు ఇదే సమయానికి లక్షా 2 వేల ఎకరాల్లో సాగవగా..ఈసారి కేవలం 17 వేల ఎకరాల్లో మాత్రమే సాగవడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులంతా వానల రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement