
మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నమూనాను పరిశీలిస్తున్న అశ్వినీ వైష్ణవ్, జి.కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు తదితరులు
రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో రైలింజన్ల ఉత్పత్తి
రైలు బోగీలు, మెట్రో రైళ్ల తయారీ కూడా: రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా కాజీపేట ఫ్యాక్టరీ వెల్లడి
రాష్ట్రం సిఫారసు, ఆర్‌ఆర్ పాలసీ ప్రకారం కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వం భూమి అప్పగిస్తే వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కాజీపేట యూనిట్‌ను సందర్శించిన మంత్రులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో 2026 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే డిసెంబర్ కల్లా యూనిట్ సివిల్ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యూనిట్ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. కాజీపేట యూనిట్‌లో రైల్వే ఇంజిన్లతోపాటు కోచ్‌లు, మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా చేపడతామని వెల్లడించారు.
ఈ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. శనివారం హను మకొండ జిల్లా అయోధ్యపురంలోని కాజీపేట రైల్వే కోచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో జరుగుతున్న పనులను కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీఎల్‌పీ నేత ఎ.మహేశ్వర్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీ పేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయన.. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనుల గురించి రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లపాటు కలగానే మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాకారం చేశారని అన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమలో బహుళ రకాల రైల్వే మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.
మోదీ మాట తప్పరు అనేందుకు ఇదే నిదర్శనం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన మాట తప్పరు అనేందుకు కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీనే ఉదాహరణ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిపారు.
నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయనే స్వయంగా వచ్చి భూమి పూజ చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని, వరంగల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు, ఆర్‌ఆర్ పాలసీ ప్రకారం స్థానికులకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే త్వరలోనే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు
వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అవసరం ఎంతో ఉందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగిస్తే వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. భూమి కోసం గత సీఎం కేసీఆర్‌కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించానని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
‘ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటివారు తమ కళ్లు తెరిచి చూడాలి. చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలి’అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.