breaking news
Kazipet railway wagons factory
-
2026 నుంచి కాజీపేటలో చిక్‌బుక్ చిక్‌బుక్ రైలే
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో 2026 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే డిసెంబర్ కల్లా యూనిట్ సివిల్ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యూనిట్ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. కాజీపేట యూనిట్లో రైల్వే ఇంజిన్లతోపాటు కోచ్‌లు, మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా చేపడతామని వెల్లడించారు. ఈ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. శనివారం హను మకొండ జిల్లా అయోధ్యపురంలోని కాజీపేట రైల్వే కోచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో జరుగుతున్న పనులను కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీఎల్పీ నేత ఎ.మహేశ్వర్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీ పేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయన.. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనుల గురించి రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లపాటు కలగానే మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాకారం చేశారని అన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమలో బహుళ రకాల రైల్వే మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. మోదీ మాట తప్పరు అనేందుకు ఇదే నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన మాట తప్పరు అనేందుకు కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీనే ఉదాహరణ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయనే స్వయంగా వచ్చి భూమి పూజ చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని, వరంగల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు, ఆర్ఆర్ పాలసీ ప్రకారం స్థానికులకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే త్వరలోనే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు వరంగల్‌లో ఎయిర్పోర్ట్ అవసరం ఎంతో ఉందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగిస్తే వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. భూమి కోసం గత సీఎం కేసీఆర్‌కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించానని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ‘ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటివారు తమ కళ్లు తెరిచి చూడాలి. చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలి’అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ, వందేభారత్‌పై కేంద్రమంత్రి కీలక హామీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ పనులను మొదలు పెడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉత్తమ్ పార్లమెంట్లో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. డోర్నకల్ – నేలకొండపల్లి – కోదాడ – హుజూర్ నగర్ – నేరేడుచర్ల – మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు. దీంతో పాటే మోతమర్రి–జగ్గయ్యపేట–మేళ్లచెర్వు–మఠంపల్లి–జాన్ పహాడ్–విష్ణు పురం–మిర్యాలగూడ రైల్వే లైన్లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని, ఈ రైల్వేలైన్‌ను డబ్లింగ్ చేయాలని కోరారు. వందేభారత్‌ను నల్లగొండలో ఆపుతామని హామీ మోతుమర్రి–మిర్యాలగూడ మధ్య ప్యాసెంజర్ రైళ్లను నడుపుతామని, డబ్లింగ్ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. విశాఖ– తిరుపతి వందేభారత్‌తో పాటు వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నల్లగొండలో ఆపేలా చర్య లు తీసుకుంటామని, మిర్యాలగూడలో ఆపే విషయంపై పరిశీలన చేస్తామని తెలిపినట్లు వెల్లడించారు. -
తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని కేంద్ర రైల్వేశాఖ రాష్ట్రానికి ఇచ్చిన సమాదనంపై గురువారం మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మాదిరిగానే రైల్వేకోచ్ ప్రాజెక్ట్‌కు బీజేపీ మంగళం పాడుతుందన్నారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామని గుర్తుచేశారు. 150 ఎకరాలు సేకరించి కేంద్రానికి అప్పగించామన్నారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే.. వరంగల్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతుందన్నారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆన్నారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ -
సమయ నిర్ధారణ సాధ్యం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడానికి సమయ నిర్ధారణ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఈమేరకు రాతపూర్వక జవాబిచ్చారు. 2011-12లోనే రెల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీని కేంద్రం మంజూరు చేసిందని, అయితే రవాణా అవసరాలను బట్టే ఈ కర్మాగారం ప్రారంభించడానికి సమయ నిర్ధారణ జరుగుతుందన్నారు. ప్రస్తుత అవసరాల మేరకు తగినన్ని వ్యాగన్లను ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని కర్మాగారాలు తయారు చేస్తున్నందు వల్ల కాజీపేట కర్మాగారం పనులను ప్రారంభించలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.152.26 కోట్లు గతంలో కేటాయించినప్పటికీ, 2014 మార్చి వరకూ వ్యయం కాలేదని, అయితే భవిష్యత్తులో రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు రద్దు కాకుండా 2015-16లో నామమాత్రపు కేటాయింపు జరిగినట్లు తెలిపారు. యూపీఎస్సీ నిపుణుల కమిటీ యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అర్హత, సిలబస్, పరీక్ష విధానం తదితర అంశాలను పరీక్షించడానికి బీఎస్ బాస్వాన్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, కమిటీ ఆరు నెలల వ్యవధిలో నివేదిక ఇస్తుందని చెప్పారు. మైనారిటీల స్థితిగతులపై... దేశంలోని మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఓబీసీలకు చెందిన 27 శాతం రిజర్వేషన్లలో సబ్కోటాగా మైనారిటీలకు 4.5 శాతాన్ని కేంద్రం కేటాయించిందని, అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిందన్నారు. ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉందని చెప్పారు. ఏపీ రాజధానికి విదేశీ సాయం కోరలేదు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధి కోసం రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఏ దేశంతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఏపీలో ప్రస్తుతం 17 నూతన రైల్వే లైన్లు, 14 డబ్లింగ్ పనులు సాగుతున్నాయని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని, 2014-15లో రూ.1,027 కోట్లు కేటాయించగా, 2015-16లో రూ.2,554 కోట్లు కేటాయించారన్నారు. నూతన రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవా ణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ-నర్సాపూర్ డబ్లింగ్ పనులు, విజయవాడ- కాజీపేట మూడోలైను, విజయవాడ బైపాస్, విజయవాడ-గూడూర్ మూడో లైనును చేపట్టామని చెప్పారు.