
రైల్వే బోర్డు తాజా యోచన
దేశవ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెట్టే చర్యలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు భావిస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తొలుత కాజీపేటలో సాధారణ రైళ్లకు వినియోగించే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, ఎంఎంటీఎస్ తరహా రైళ్లకు వినియోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ), సాధారణ వందేభారత్ కోచ్‌లను తయారు చేయాలని బోర్డు భావించింది. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీలైనన్ని వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన నేపథ్యంలో కాజీపేట కొత్త కోచ్ ఫ్యాక్టరీని అందుకు కేటాయించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ దాదాపు సిద్ధమైనా, ఇప్పటివరకు కోచ్‌ల తయారీ ఆర్డర్‌ను ఇవ్వలేదు. వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయిస్తేనే బాగుంటుందన్న భావనతోనే వర్క్ ఆర్డర్ జారీలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది.
వందేభారత్ స్లీపర్ రైళ్లకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 రూట్లలో 76 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో 33 రైళ్లు మాత్రమే 20, 16 కోచ్‌లతో నడుస్తుండగా మిగతావన్నీ 8 కోచ్‌లతో కూడిన మినీ వందేభారత్ సర్వీసులుగా సేవలందిస్తున్నాయి. వందేభారత్ రైళ్లు ప్రారంభించిన కొత్తలో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడి అన్ని రాష్ట్రాలు వాటి కోసం పోటీలో నిలిచాయి. కానీ, టికెట్ ధర ఎక్కువగా ఉండటం, అవి కేవలం పగటి పూట మాత్రమే నడుస్తుండటంతో వాటిపై రానురాను ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇదే సమయంలో కేంద్రం వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది.
ఇప్పటికే ఒక ప్రోటోటైప్ రైలు ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. రెండోది త్వరలో ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఆ వెంటనే వీటిని పట్టాలెక్కించనున్నారు. వీటి గరిష్ట వేగం గంటకు 180 కి.మీ.లు కావటంతోపాటు ఇవి స్లీపర్ మోడ్ రైళ్లు అయినందున రాత్రివేళ తిరుగుతాయి. దూరప్రాంతాల మధ్య తిరిగే రైళ్లలో పగటివేళ ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరు. దానివల్ల పనులు చేసుకునే పగటి సమయం వృథా అవుతుండటమే కారణం. దీంతో ఇప్పుడు సాధారణ వందేభారత్ రైళ్లకు బదులు తమకు వందేభారత్ స్లీపర్ సర్వీసులు కేటాయించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో క్రమంగా సాధారణ వందేభారత్ రైళ్ల డిమాండ్ తగ్గుతూ వస్తోంది.
200 వందేభారత్ స్లీపర్ రైళ్లు...
వీలైనంత తొందరలో దేశవ్యాప్తంగా 200 వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. క్రమంగా ప్రస్తుతం తిరుగుతున్న రాజధాని, దురొంతో ప్రీమియం కేటగిరీ సహా సూపర్ ఫాస్ట్ రైళ్ల స్థానంలో వాటిని ప్రవేళపెట్టే యోచనలో ఉంది. ఇది జరగాలంటే తక్కువ సమయంలో వీలైనన్ని రేక్స్ తయారు కావాల్సి ఉంటుంది.
– ప్రస్తుతం చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తొలి ప్రోటోటైప్ రైలు తయారు కాగా, అక్కడ మరిన్ని రైళ్లను తయారు చేయనున్నారు.
– రష్యాకు చెందిన కినెత్ రైల్వే సొల్యూషన్స్‌తో కలిసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూర్‌లోని మరాటా్వడా కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి.
– బెంగళూరులోని భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)లో రెండో ప్రోటోటైప్ రైలు సిద్ధమవుతుండగా, ఇక్కడ వెంటనే మరిన్నింటి తయారీ కొనసాగనుంది.
– కోల్‌కతా శివారులోని టీటాగర్ రైల్ సొల్యూషన్స్ ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్‌లోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలను కూడా ఇందుకు వినియోగించనున్నారు.
అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండాలంటే మరిన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో కూడా వాటి తయారీ అవసరమని తాజాగా రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో కొత్తగా అందుబాటులోకి వస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇందుకు వినియోగించాలని భావిస్తోంది. ఈమేరకు ఇటీవల అధికారులు కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి వెళ్లారు. ఈ సంవత్సరం చివరి నాటికి అది పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించొచ్చని అధికారులు తేల్చారు. ఆ మేరకు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు ఢిల్లీలో కూడా సమావేశమై దీనిపై చర్చించినట్టు తెలిసింది.