
నవ వధువును కబళించిన రోడ్డు ప్రమాదం
పెళ్లయిన మూడు రోజులకే మృత్యువాత
పీజీ సెట్ రాయడానికి వచ్చి అనంత లోకాలకు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో ఘటన
తిమ్మాపూర్/చొప్పదండి/గొల్లపల్లి: కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. చేతులకు వేసుకున్న గోరింటాకు ఇంకా చెరిగిపోలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయలేదు. వచ్చిన బంధువులు తిరిగి ఇంకా ఇళ్లు చేరనేలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన నవవధువును లారీరూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలకేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం..
జిల్లాలోని చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల(22)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామానికి చెందిన చిరుత రాజుతో ఈనెల 6వ తేదీన వివాహం జరిగింది. శుక్రవారం పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అఖిల భర్త రాజుతో కలిసి తిమ్మాపూర్ మండలకేంద్రంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చింది.
పరీక్ష రాసి బైక్‌పై ఇద్దరూ కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో వెనకనుంచి లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన అఖిల అక్కడికక్కడే చనిపోయింది. రాజుకు స్వల్పగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ సురేందర్‌సింగ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.