
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో రాష్ట్రంలో ప్రకంపనలు
చేతికి మట్టి అంటకుండా ముందుకెళ్లేలా పావులు కదుపుతున్న అధికార కాంగ్రెస్
అందులో భాగంగానే అసెంబ్లీకి రిపోర్టు.. అనివార్యంగా కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించే వ్యూహం
నివేదికలోని లోపాలను ఎత్తిచూపుతూ హరీశ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
తమ వాదన క్షేత్రస్థాయికి తీసుకెళ్లెందుకు జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరణ
నివేదికను సమర్థించాలో, వ్యతిరేకించాలో అర్థం కాని పరిస్థితుల్లో బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సుదీర్ఘ నివేదిక రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చేసింది. మూడు ప్రధాన పార్టీలూ.. నివేదికను, అనంతర పరిణామాలను రాజకీయంగా తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలా అన్న దానిపై దృష్టి సారించాయి.
ఈ రిపోర్టు ఆధారంగా బీఆర్‌ఎస్‌ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాలని అధికార కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుండగా, అందులోని లోపాలను ఎత్తిచూపుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. మరో ప్రధాన రాజకీయ పక్షం బీజేపీ ఈ నివేదికపై ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది.
అధికార కాంగ్రెస్ ద్విముఖ వ్యూహం
కాళేశ్వరం నివేదిక విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండాలనే వ్యూహంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పాచిక విసిరిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టడం ద్వారా ద్విముఖ వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీలతో మాట్లాడించి.. నివేదికకు అసెంబ్లీ ఆమోదం ఇప్పించి.. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆదేశించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగం అయితే, మరో ఎత్తుగడ కూడా ఉందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను అక్కడకు రప్పించే వ్యూహం కూడా ఇందులో ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నివేదిక ద్వారా అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొని తన వాదనను వినిపించాల్సిన అనివార్యతను కేసీఆర్‌కు కల్పించామని, ఆయన వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన చేసిన తప్పులను అక్కడే ఎండగడతామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని వారంటున్నారు.
దూకుడుగానే బీఆర్‌ఎస్
నివేదిక విషయంలో బీఆర్‌ఎస్ కూడా దూకుడుగానే వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జస్టిస్ ఘోష్ నివేదికను ఆ పార్టీ నేతలు చాలామంది ఖండించగా, మాజీ మంత్రి హరీశ్‌రావు ఓ అడుగు ముందుకేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని లోపాలను ఎత్తిచూసే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహం రచించారు. అన్ని జిల్లాల్లోనూ స్క్రీన్‌లు పెట్టి పార్టీ నాయకులకు ప్రజెంటేషన్‌ను చూపించారు. ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళ్లాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నప్పటికీ.. భవిష్యత్ పరిణామాలపై కూడా బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది.
ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే కమిషన్ విచారణ పేరుతో పిలిపించడంతో పాటు నివేదిక ప్రజల్లో పెట్టి ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేయగా.. అసెంబ్లీ వేదికగా మరో విచారణ ప్రకటించి మానసికంగా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టవచ్చనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఏదిఏమైనా ఘోష్ నివేదిక ఆధారాల్లేనిదని, బీఆర్‌ఎస్‌ను బద్‌నాం చేయడమే లక్ష్యంగా ఇచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని గులాబీ నేతలంటున్నారు.
బీజేపీ అటా..ఇటా?
జస్టిస్ ఘోష్ నివేదిక కమలం పార్టీకి గొంతులో వెలక్కాయ పడినంత పని చేసిందని రాజకీయ వర్గాలంటున్నాయి. కాళేశ్వరం నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం ఈ ప్రాజెక్టుతో ఆయాచిత లబ్ధి పొందిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఘోష్ నివేదికను సమర్థించాలో, వ్యతిరేకించాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.
ఈ నివేదికను బీజేపీ సమర్థించకపోతే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని, అందుకే ఇన్నాళ్లు ఆరోపణలు చేసినా ఇప్పుడు మౌనంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించే అవకాశాలున్నాయి. ఒకవేళ నివేదికతో ఏకీభవిస్తే.. ఆ నివేదిక తప్పుపట్టినట్టుగా తమ పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కూడా తప్పు చేశారని అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కింకర్తవ్యంపై ప్రభుత్వం మల్లగుల్లాలు
ప్రస్తుత పరిస్థితుల్లో కింకర్తవ్యం ఏమిటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడు తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ–రేసు, ఫోన్‌ట్యా పింగ్ కేసుల్లో ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలోనూ అదే జరిగితే బీఆర్‌ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు భావింవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందువల్ల అసెంబ్లీ వేదికగా ప్రకటించే విచారణను త్వరగా పూర్తి చేసి కాళేశ్వరం అక్రమాల బాధ్యులపైనైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో పార్టీపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు. మరోవైపు అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన అధికారిని కూడా కమిషన్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.