మంగళవారం ఎర్రగడ్డలోని నటరాజ్‌నగర్ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వల్పంగా పెరిగిన ఓటింగ్
ఉదయం మందకొడిగా.. చివరి గంటలో సందడిగా ఓటేసిన నియోజకవర్గ ప్రజానీకం
పోలింగ్ ప్రశాంతం... కొన్నిచోట్ల ఉద్రిక్త వాతావరణం
కోడ్ ఉల్లంఘన, దొంగ ఓట్లపై పార్టీల పరస్పర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్, సాయంత్రం వరకు కూడా అంతంత మాత్రంగానే సాగింది. అయితే చివరి గంటలో మాత్రం పోలింగ్ బూత్‌లలో ఓటర్ల సందడి కనిపించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ గడువు ముగియడంతో గేట్లు మూసివేసి అప్పటివరకు క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు.
మొరాయించిన ఈవీఎంలు
పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఉదయమే ఓట్లు వేసి డ్యూటీలు, వివిధ పనులకు వెళ్లాలనుకున్న ఓటర్లు తీవ్ర ఇబ్బంది గురయ్యారు. తర్వాత పరిస్థితి చక్కబడినా సాయంత్రం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు పెద్దగా రాలేదు. బస్తీల్లో మాత్రమే కొంత హడావుడి కనిపించింది. ఇక నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రముఖులు, సినీ తారలు, అధికారులు మాత్రం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా కోడ్ ఉల్లంఘన, దొంగ ఓట్లు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు పర్సపరంగా ఆరోపణలు చేశాయి. ప్రధాన పక్షాల అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు పోలింగ్ బూత్‌లు తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతర నేతలు తిరుగుతున్నారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించి ఆదేశాల ఇవ్వడంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం సాంకేతికతను వినియోగిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే తెలిసేలా 136 డ్రోన్‌లతో పర్యవేక్షించింది.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్
పలు పొలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాటలు వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసే సమయంలో..యూసుఫ్‌గూడలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌తో కలిసి ఆందోళనకు దిగారు. దీనిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు షేక్‌పేట్ డివిజన్ అపెక్స్ హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఇక యూసుఫ్‌గూడ సవేర ఫంక్షన్ హాల్ వద్ద కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి బూత్‌కీ ఎందుకు తిరుగుతున్నారంటూ బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీకష్ణానగర్‌లోని ఎ బ్లాక్ పోలింగ్ బూత్‌లో దొంగఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ సునీత బైఠాయించారు. షేక్‌పేట్ అల్‌ఫల స్కూల్, సమత కాలనీల వద్ద గల పోలింగ్ స్టేషన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఆయా పోలింగ్ బూత్‌ల ముందు బైఠాయించారు.
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉండడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
దాదాపు 1 శాతం అధికంగా పోలింగ్
చివరిసారిగా అందిన సమాచారం మేరకు ఈ ఉప ఎన్నికలో 48.42 శాతం పోలింగ్ నమోదైంది. అయితే దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చూసి తాజా ఎన్నికలో 50 శాతానికి పైగా పోలింగ్ ఉంటుందని పలువురు భావించినప్పటికీ ఎప్పటి మాదిరే నమోదైంది.
రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికలకు ఎంతోకాలం ముందునుంచే ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తప్పకుండా ఓట్లు వేయాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం కన్పించలేదు. అధికారుల అవగాహన కార్యక్రమాలను కూడా స్థానికులు పట్టించుకోలేదు.


