జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
407 పోలింగ్ కేంద్రాల్లో 4 లక్షల మంది ఓటర్లు
గెలుపే ధ్యేయంగా సర్వశక్తులూ ఒడ్డిన ప్రధాన పార్టీలు
ప్రచారం ముగిశాక జోరుగా కొనసాగిన ప్రలోభాలు
ఓటుకు వెయ్యి నుంచి రూ. 2,500 మధ్య పంపిణీ
మహిళా ఓటర్లకు నగదుతోపాటు చీరలు అందజేత
స్వయం సహాయక సంఘాల సభ్యులు, లీడర్లకు మరింత సొమ్ము
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇన్‌చార్జి మంత్రులకు సీఎం ఆదేశం
పోలింగ్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను నియమించిన బీఆర్‌ఎస్, బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 4 లక్షల మందికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించడంతోపాటు డ్రోన్ల ద్వారా కూడా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకోనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సర్వశక్తు లూ ఒడ్డాయి. నెలరోజులకు పైగా జరిగిన ప్రచారపర్వంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి.
ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే..
ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పార్టీలు ప్ర లోభాలకు తెరలేపాయి. ఓటర్లను రహస్యంగా కలుస్తూ నగ దు పంపిణీకి తెరలేపాయి. ఆది, సోమవారాల్లో గుట్టుగా ఇంటింటికీ వెళ్లి ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 2,500 చొప్పున నగదు పంపిణీ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు తాయిలాలు కూడా అందిస్తున్నాయని తెలుస్తోంది. బోరబండ, రహమత్‌నగర్ డివిజన్లలోని మహిళల కు నగదుతోపాటు చీరలు కూడా పంచినట్లు సమాచారం.
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ ప్రధాన రాజకీ య పార్టీ గట్టిగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని.. ఓటరుగా ఉన్న వారికి నగదు ఇవ్వడంతోపాటు గ్రూపు సభ్యులుగా ఉన్న మహిళలకు అదనంగా రూ. 2,500, గ్రూపు లీడర్లకు రూ. 5 వేల చొప్పున నగదు పంచినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన పార్టీ ఓటర్లకు రూ. 1,000 నగదు పంపిణీని పూర్తి చేసిందని సమాచారం.
పోలింగ్ పర్యవేక్షణ కోసం...
నేడు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల కు ఆదేశాలు అందాయి. పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి అభ్యర్థి వరకు అందరూ సాయంత్రం పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూంలకు తరలేంత వరకు జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ భేటీలో పార్టీ ప్రచార తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారని.. మంగళవారం పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ పోలింగ్ సరళి పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి.


