ఇక పోలింగే తరువాయి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హోరాహోరీ ప్రచారానికి తెర
కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు
ఆ మూడు పక్షాల మధ్యే ప్రధాన పోరు.. రేపటి పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం
ప్రలోభాలకు తెరలేపిన రాజకీయ పార్టీలు.. ఓటుకు నోటుతోపాటు విందులు, వినోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రచార గడువు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల మైకులు బందయ్యాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా, అంతకుముందు అంతర్గతంగా ప్రచార పర్వంలో నిమగ్నమై కాళ్లకు బలపాలు కట్టుకొని నియోజకవర్గమంతా చుట్టివచి్చన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం ముగియడంతో సేద దీరారు.
అయితే, ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రలోభాలకు తెరలేచాయనే చర్చ జరుగుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న మూడు ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు ఇతర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభపర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతోపాటు పలు రకాల తాయిలాలు ఇస్తున్నారని, గల్లీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్లు, కులాలు, వర్గాల వారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈసారి ఓటుకు రూ. 1,500 నుంచి రూ.5,000 వరకు ఇస్తున్నారని, ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అపార్ట్‌మెంట్ ఓటర్లకు రూ.3 వేలు, బస్తీల్లో రూ.5 వేల వరకు పంచేందుకు రాజకీయ పక్షాలు వెనుకాడడం లేదని, చివరి క్షణాల్లో గెలుపునకు అవసరమైన అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బహిరంగ రహస్యంగానే మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంమీద ప్రచార పర్వం ముగియడంతో సోమవారం ప్రలోభాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఇప్పటివరకు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, గడప గడపకూ ప్రచారాలతో హోరెత్తిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ప్రలోభాలతో సందడిగా మారింది.
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఈసీ
మంగళవారం జరగనున్న పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్‌లలో దాదాపు రెండువేలకు పైగా సిబ్బందిని పోలింగ్ నిర్వహణకు నియమించారు. 2,494 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించి ఈ పోలింగ్ నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. పోలీసు బందోబస్తు కోసం వేల సంఖ్యలో సిబ్బందిని నియమించారు. సోమవారం రాత్రికి పోలింగ్‌స్టేషన్ల వారీగా అటు ఎన్నికల నిర్వహణ, ఇటు బందోబస్తు సిబ్బందిని పంపడం ద్వారా పోలింగ్ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలంటున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


