వాన లోటు తీరినట్టే!

It has been raining for three days in the state - Sakshi

రాష్ట్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న వర్షాలు

చాలా జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం.. 3 జిల్లాల్లో అధికం

ఏడు జిల్లాల్లో ఇంకా కొంత లోటు.. 

మరో రెండ్రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ

పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో గోదావరి, ఉప నదుల పరవళ్లు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: : రాష్ట్రమంతటా మూడు రోజులుగా వాన ముసురుకుంది. మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగుతాయని వాతా­వ­రణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలరోజులైనా వానలుపడక నెలకొన్న లోటు అంతా తీరిపోతోంది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఏకంగా 20 శాతం వరకు లోటు వర్షపాతం ఉండగా.. బుధవారానికి ఇది ఐదు శాతానికి తగ్గింది.

నైరుతి సీజన్‌లో ఏటా ఈ సమయం వరకు 25.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 24.48 సెంటీమీటర్లకు చేరింది. మరో రెండ్రోజులు వానలు కొనసాగే అవకాశం ఉండటంతో లోటు పూర్తిగా భర్తీ అవుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. 3 జిల్లాల్లో అధికంగా, 23 జిల్లాల్లో సాధారణ, 7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

♦ అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌

♦ సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: ఆదిలా­బాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జన­గామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కా­జిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, నారాయణపేట, జయశంకర్‌ భూపాలపల్లి

♦ లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు: మహబూ­బాబాద్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం

8 జిల్లాలకు  ఆరెంజ్‌ అలర్ట్‌
పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలు, ఉత్తర ఏపీ తీరం, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని వల్ల వచ్చే 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని తెలిపింది.

గోదావరిలో పెరిగిన వరద
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలోని పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో.. గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు పరవళ్లు తొక్కుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ­(లక్ష్మి) బ్యారేజీలోకి ప్రాణహిత నుంచి 5,41,430 క్యూసెక్కుల వరద వస్తుండగా.. గేట్లు ఎత్తి 5,25,250 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

దీనికి ఇంద్రావతి వరద తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 6,53,170 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత శబరి, ఇతర వాగుల ప్రవాహాలు కలిసి గోదావరి వరద పోలవరం వైపు పరుగుపెడుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 11 గంటలకు గోదావరి వరద 35.07 అడుగులకు చేరింది.

వానలు కొనసాగుతుండటంతో ప్రవాహం భారీగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఎగువ గోదావరిలోనూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 33,760 క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ 33.34 టీఎంసీలకు చేరింది.

వానతో ఏజెన్సీ ప్రజల తిప్పలు 
ఎడతెరిపి లేని ముసురు, వానలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నెలలు నిండిన గర్భిణులను సమీపంలోని సామాజిక ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు.

వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగపేట మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వెంకటాపురం(కె) మండలంలో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రధానకాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది.  

గ్రావిటీ కాల్వకు మరమ్మతులేవి!
కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గ్రావిటీ కాల్వ వర్షాల­తో కోతకు గురై కూలుతున్నా.. మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత ఏడాది జూలై 14న భారీవర్షాలతో కాల్వ పొడవునా అక్కడక్కడా సిమెంట్‌ లైనింగ్‌ కోతకు గురైంది.

ప్రస్తుతం రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి వరదనీరు వచ్చి మరింత మట్టి కొట్టుకువస్తోంది. కొట్టుకు వచ్చిన మట్టితో పాటు వరద నీరు మొత్తం గ్రావిటీ కాల్వలోకి చేరుతోంది. ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో కాల్వ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top