ఓవర్‌లోడ్ వాహనాన్ని పట్టుకున్న అధికారులు
పరిమితికి మించిన బరువుకు ఓ శాఖ ఓకే .. అది నేరమంటున్న మరో శాఖ
క్రషర్లు, ఇసుక రీచ్‌లు తదితర చోట్లఇష్టారీతిన ట్రాన్సిట్ పాస్‌ల జారీ
ఓవర్‌లోడ్ వాహనాలకువే బిల్లులు, ట్రాన్సిట్ పాస్‌లజారీ చట్ట విరుద్ధమంటున్నరవాణా శాఖ
సాక్షి, హైదరాబాద్: పదో ఇరవయ్యో కాదు.. నిత్యం వందల సంఖ్యలో ట్రక్కులు/లారీలు సామర్థ్యానికి మించిన లోడ్ తో పరుగులు తీస్తున్నాయి. కంకర, ఇసుక, బొగ్గు, ఫ్లైయాష్, ధా న్యం బస్తాలు, ఇతరత్రా సరుకు రవాణా వాహనాలు పరిమితికి మించిన బరువుతో వెళుతూ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రాణాలూ తీస్తున్నాయి.
ఇసుక రీచుల వద్ద ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు, థర్మల్ పవర్ సంస్థల వద్ద ఎన్టీపీసీ, తెలంగాణ జెన్‌కో, సింగరేణి అధికారులు ఫ్లై యాష్ (బూడిద)ను వాహనాల్లో ఓవర్ లోడ్ చేసి పంపుతున్నారు. ఇలా కొన్ని ప్రభుత్వ విభాగాలు నిబంధనలు అతిక్రమిస్తుంటే, గుడ్డిగా వ్యవహరిస్తుంటే.. మరో ప్రభుత్వ విభాగమైన రవాణా శాఖ అధికారులు..పరిమితికి మించిన బరువు కింద ఆ వాహనాలను జప్తు చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా..
గతేడాది నవంబర్‌లో చేవెళ్ల సమీపంలోని మిర్జాగూడ గ్రామ శివారులో 50 టన్నుల ఓవర్‌లోడ్ కంకర లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొని 19 మంది మృతికి కారణమైంది. ఇది ఇటీవలి కాలంలో అతిపెద్ద ప్రమాదం కాగా, పెద్దా చిన్నా ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఈ ఓవర్ లోడింగ్‌ను నియంత్రించేలా కఠిన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎంత ఎక్కువ లోడ్ నింపితే అంత రాయల్టీ రూపంలో ఆదాయం వస్తుండటంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని, అమాయక ప్రజల ప్రాణాల కంటే ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. వారం క్రితం రవాణా శాఖ అర్ధరాత్రి వేళ లారీల తనిఖీ ప్రారంభించగా, కేవలం మూడు రోజుల్లోనే 376 లారీలు ఓవర్‌లోడ్‌తో దొరికాయి. కొన్ని ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో ఓవర్ లోడ్ లారీలు దొరికాయంటే, నిత్యం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పరుగుపెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ తనిఖీల సందర్భంలోనే భూపాలపల్లి రవాణా శాఖాధికారి ఓ లారీ ఢీకొని చనిపోవటంతో తనిఖీలను నిలిపేశారు.
ప్రమాదాలే కాదు..ఇతర నష్టాలూ..
» రాష్ట్రంలో ఓవర్ లోడ్ వాహనాల వల్ల ఏడాదికి సగటున 360 ప్రమాదాలు జరుగుతున్నాయి. 400 మంది వరకు చనిపోతున్నారు.
» ప్రతి రోడ్డుకు సామర్థ్యం ఉంటుంది. దాని ఆధారంగా ఎంత బరువు ఉన్న వాహనాలు వెళ్లొచ్చన్నది నిర్ధారిస్తారు. ఆ రోడ్డు తట్టుకునే స్థాయిని మించిన బరువు ఉన్న భారీ వాహనాలు పదేపదే తిరుగుతుంటే రోడ్లు త్వరగా పాడైపోతాయి. వాహనం అదనంగా మోసే ప్రతి టన్ను బరువు, రహదారిపై ’వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్’ను విపరీతంగా పెంచుతుంది. దీనివల్ల రోడ్లపై భారీ గుంతలు ఏర్పడటం, తారు లేచిపోవడం, కుంగిపోవడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లుగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఓవర్ లోడ్ వాహనాల రాకపోకల వల్ల దాదాపు 854 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు దాదాపు రూ.1,030 కోట్లు అవసరమవుతాయని అంచనా.
» ట్రక్కు/ట్రాలీ సామర్థ్యానికి మించిన లోడ్‌ను అధికారులే అనుమతిస్తుండటంతో లారీల యజమానులు ఎక్కువ లోడ్‌ను తరలించేందుకు వీలుగా వాహనాల ఎత్తును అక్రమంగా పెంచుతున్నారు.
పూర్తిగా చట్ట విరుద్ధం
ఓవర్‌లోడ్ వాహనాలకు వే బిల్లులు, ట్రాన్సిట్ రసీదులు జారీ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుంది. మోటారు వాహనాల చట్టం 1988 (సెక్షన్ 113) ప్రకారం వాహన ఆర్సీలో పేర్కొన్న సామర్థ్యానికి మించి అదనంగా లోడ్ చేయటానికి వీలులేదు. సెక్షన్ 194 – 199 ప్రకారం ఓవర్‌లోడ్ వాహనాలను నడపడం శిక్షార్హమైన నేరం. దీనికి కారణమైన క్వారీ యాజమాన్యాలు, బిల్లులు జారీ చేసిన సంస్థలపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఆ వాహనాలు నడిపిన డ్రైవర్ లైసెన్సులు రద్దు చేయొచ్చు.
ట్రాన్సిట్ పాస్‌లు జారీ చేసే చోటే ఓవర్‌లోడ్‌ను నియంత్రించాలి. లేని పక్షంలో మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 199 ప్రకారం క్వారీలకు, కంపెనీలకు నోటీసులు జారీ చేస్తాం. ఈ విషయాన్ని ఇటీవలే సంబంధిత విభాగాలకు లిఖితపూర్వకంగా తెలియజేశాం. ఓవర్ లోడ్‌తో బయటకు వెళ్లిన వాహన వివరాలు అందజేయాలని కూడా కోరాం. ఆ వివరాల ఆధారంగా జరిమానా / కాంపౌండింగ్ ఫీజు చెల్లించాలని సంబంధిత వాహన యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. – చంద్రశేఖర్ గౌడ్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్)
ఇది జూన్ 18న గనుల శాఖ యాదాద్రి జిల్లా సహాయ సంచాలకుల పేరుతో జారీ అయిన ట్రాన్సిట్ పాస్ వే బిల్లు. ట్రక్కులో 44 టన్నుల కంకరను లోడ్ చేసినట్టు అందులో ఉంది. అయితే అందులో 22.8 టన్నుల లోడింగ్‌కు మాత్రమే అనుమతి ఉందని, కానీ 21 టన్నులకు పైగా అక్రమంగా లోడ్ చేశారని రవాణా శాఖ తేల్చింది.

ఇది మే 16న జారీ అయిన ట్రాన్సిట్ పాస్. ఈ ట్రక్కులో 25.9 టన్నుల కంకర లోడ్ చేసినట్టు గనుల శాఖ పేర్కొంది. అయితే ఆ ట్రక్కు కేవలం 17.5 టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉందని రవాణాశా ఖ తేలి్చంది. అంటే 8.4 టన్నుల అదనపు బరువును నింపారన్న మాట.


