రెండేళ్లలో రెండు లక్షలే.. | Irrigation area cultivation during Congress regime was negligible | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో రెండు లక్షలే..

Jan 20 2026 2:46 AM | Updated on Jan 20 2026 2:46 AM

Irrigation area cultivation during Congress regime was negligible

కాంగ్రెస్‌ హయాంలో కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంతంతే...

ప్రాధాన్యత, ఇతర ప్రాజెక్టుల కింద రెండేళ్లలో 11.61 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం 

నిధులు, భూసేకరణ సమస్యలతో నీరసించిన ప్రాజెక్టుల నిర్మాణం.. బడ్జెట్‌లో కేటాయింపులకు తగ్గట్టు విడుదల కాని నిధులు 

విడుదలైన నిధుల్లో సింహభాగం పెండింగ్‌ బిల్లులకే.. 

రెండేళ్లలో రూ.24,103 కోట్ల పనుల లక్ష్యం..రూ.11,333 కోట్ల పనులే జరిగిన వైనం 

2027–28 నాటికి 23.56 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం 

ప్రస్తుత వేగంతో లక్ష్యం చేరుకోవడం అనుమానమేనన్న అభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాగా, రెండేళ్లలో 1.96 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చింది. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టుల కింద చేర్చి 2028–29 నాటికి 43.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో లక్ష్యం పెట్టుకోగా, ఆ తర్వాత కాలంలో 2027–28కి 23.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా లక్ష్యాన్ని కుదించుకుంది. తాజా లక్ష్యం మేరకు 2024–25 లోనే 6.56 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా 1.62 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. 2025–26లో 5.05 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 34,654 ఎకరాలే సాగులోకి వచ్చాయి. మొత్తం కలిపి రెండేళ్లలో 11.61 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,96,956 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయి.  

నిధుల లేమి భూసేకరణ సమస్య 
నిధులు లేమీతో పాటు భూసేకరణ సమస్యలతో గడిచిన రెండేళ్లలో ప్రాజెక్టుల పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధ్యం కాలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాధాన్యత, అప్రాధాన్యత కేటగిరీలు కలిపి 2024–25లో రూ.6,577.8 కోట్ల విలులైన పనులు చేయాల్సి ఉండగా, రూ.8,049.56 కోట్ల పనులు జరిగాయి. అయితే 2025–26లో రూ.17,525 కోట్లు విలువైన పనులు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.3,284 కోట్లు విలువైన పనులే జరిగాయి. గత రెండేళ్లలో మొత్తం రూ.24,103 కోట్ల విలువైన పనులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, రూ.11,333 కోట్ల పనులే జరిగాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి 2024–25 బడ్జెట్‌లో రూ.12,845 కోట్లను కేటాయించగా, రూ.6,946.66 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 

ఇక 2025–26లో రూ.11,786 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా, ఇప్పటి వరకు రూ.4,450 కోట్లు విడుదల చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోని పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకే కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సింహభాగం ఖర్చవడం గమనార్హం. కాగా రెండేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి కొరవడింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతలు పథకాలు మినహా ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తిగా పడకేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే నాటికి రూ.9,527.38 కోట్ల నిధులను విడుదల చేస్తే కొత్తగా మరో 3,94,899 ఎకరాల ఆయకట్టును సృష్టించగలమని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. కానీ ప్రస్తుత వేగంతోనే పనులు జరిగితే మాత్రం సగం లక్ష్యాన్ని అందుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

నిర్మాణం చివర్లో ఉన్నా పురోగతి సున్నా.. 
నిర్మాణం చివరి దశలో ఉండి అతి తక్కువ వ్యయంతో పూర్తయ్యే 6 ప్రాజెక్టులను ‘కేటగిరీ–ఏ’ పేరుతో అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుల కింద చేర్చి 2025 మార్చి 31 నాటికి వాటి కింద 100 శాతం మిగులు ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆరు ప్రాజెక్టుల కింద మొత్తం 4.44 లక్షల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉండగా, కాంగ్రెస్‌ అధికారంలోకి రాక ముందే 3.96 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మిగిలిన 47,882 ఎకరాల ఆయకట్టుకు 2025 మార్చి 31లోగా సాగునీరు అందించాల్సి ఉండగా, అప్పటికి కేవలం 5 వేల ఎకరాలు, ఆ తర్వాత 2025–26లో ఇప్పటివరకు మరో 5,200 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయి. 

ఒక్క నిల్వాయి ప్రాజెక్టు కిందే లక్ష్యం మేరకు 5 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. పాలెంవాగు కింద 2,632 ఎకరాలు, సదర్మట్‌ బరాజ్‌ కింద 18,016 ఎకరాలు, పిప్రి ఎత్తిపోతల కింద 4,214 ఎకరాలకు గాను ఇప్పటివరకు ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదు. మత్తడివాగు అదనపు పనుల కింద 1,200 ఎకరాలకు గాను ఇప్పటివరకు 700 ఎకరాలు, ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ కింద 16,775 వేల ఎకరాలకు గాను 4,500 ఎకరాలే సాగులోకి వచ్చాయి. ఈ ఆరు ప్రాజెక్టుల పూర్తికి రెండేళ్లలో రూ.352 కోట్లను ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.121 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.  

ముందుకు సాగని కేటగిరీ–బీ ప్రాజెక్టులు.. 
కేటగిరీ–ఏ తర్వాతి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో కేటగిరీ–బీ, కేటగిరీ–బీ కాంపోనెంట్‌–ఏ, ఇతర ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం విభజించింది. కేటగిరీ–బీ కింద గోదావరి బేసిన్‌ పరిధిలోని కాళేశ్వరం, మొడికుంటవాగు, లోయర్‌ పెన్‌గంగా, ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను చేర్చి 2024–25 నాటికే 2.4 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 1.12 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. ఇక 2025–26లో వీటి కింద మరో 2.23 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 16 వేల ఎకరాలే సాగులోకి వచ్చాయి. గత రెండేళ్లలో రూ.7,582 కోట్లను ఈ ప్రాజెక్టులపై వెచ్చించాలని లక్ష్యం కాగా, రూ.1,713 కోట్ల వ్యయం మాత్రమే జరిగింది.  

– కేటగిరీ–బీ కాంపోనెంట్‌–ఏ కింద కృష్ణా బేసిన్‌లోని కోయిల్‌సాగర్, రాజీవ్‌ బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేర్చింది. వీటి కింద 2024–25లో 1.09 లక్షల ఎకరాలకు గాను 41,818 ఎకరాలు, 2025–26లో 2.26 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 8,454 ఎకరాలే సాగులోకి వచ్చాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టులపై రూ.9,327 కోట్లను ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.1,813 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.  

– ప్రాధాన్యత జాబితాలో లేని ఇతర ప్రాజెక్టుల కింద పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, ఇందిరమ్మ ఫ్లడ్‌ఫ్లో కెనాల్, గట్టు ఎత్తిపోతలు, నారాయణ్‌పేట–కొడంగల్, ముత్యాల బ్రాంచ్‌ కాల్వ, జాన్‌పహాడ్‌ బ్రాంచ్‌ కాల్వ ప్రాజెక్టులను చేర్చారు. వీటి కింద 2024–25లో 23 వేల ఎకరాలు, 2025–26లో 2 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, వరుసగా 3 వేలు, 5 వేల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయి.  

వచ్చిన ఆయకట్టు సీతారామ కిందే.. 
కేటగిరీ–బీ, కేటగిరీ–బీ కాంపోనెంట్‌–ఏ కింద కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఉన్న ప్రాజెక్టుల కింద 2024–25లో మొత్తం 2.81 లక్షల ఎకరాలకు గాను 1.54 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇందులో 1.11 లక్షల ఎకరాలు ఒక్క సీతారామ ఎత్తిపోతలు పథకం కిందే సాగులోకి వచ్చాయి. ఇక 2025–26లో మొత్తం 4.5 లక్షల ఎకరాలకు గాను 24,454 ఎకరాలే సాగులోకి వచ్చాయి.  

మేజర్‌ ప్రాజెక్టుల కింద వచ్చింది 39 లక్షల ఎకరాలే.. 
పాత మేజర్‌ ప్రాజెక్టుల కింద ప్రతిపాదించిన 21.23 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టి పూర్తిగా కాగా..మరో 2.64 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు గాను 2.47 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. నిర్మాణంలోని మేజర్‌ ప్రాజెక్టుల కింద మొత్తం 70.54 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా, ఇప్పటివరకు 18.37లక్షల ఎకరాల ఆయకుట్ట అభివృద్ధి మాత్రమే జరిగింది. వీటి కింద 28 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రతిపాదించగా, 22.67 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. 

మేజర్‌ ప్రాజెక్టుల కింద మొత్తం 91.77 లక్షల ఎకరాల ప్రతిపాదిత కొత్త ఆయకట్టుకు గాను 39.6 లక్షల ఎకరాల అభివృద్ధి మాత్రమే జరిగింది. మొత్తం 28.96 లక్షల ఎకరాల స్థిరీకరణకు గాను 22.67 ఎకరాల స్థిరీకరణ జరిగింది. పాత మీడియం ప్రాజెక్టుల కింద 3.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గాను 3.18 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధి జరగగా, నిర్మాణంలోని మీడియం ప్రాజెక్టుల కింద 1.69 లక్షల ఎకరాలకు గాను 91 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement