breaking news
New irrigation schemes
-
రెండేళ్లలో రెండు లక్షలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాగా, రెండేళ్లలో 1.96 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చింది. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టుల కింద చేర్చి 2028–29 నాటికి 43.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో లక్ష్యం పెట్టుకోగా, ఆ తర్వాత కాలంలో 2027–28కి 23.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా లక్ష్యాన్ని కుదించుకుంది. తాజా లక్ష్యం మేరకు 2024–25 లోనే 6.56 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా 1.62 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. 2025–26లో 5.05 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 34,654 ఎకరాలే సాగులోకి వచ్చాయి. మొత్తం కలిపి రెండేళ్లలో 11.61 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,96,956 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయి. నిధుల లేమి భూసేకరణ సమస్య నిధులు లేమీతో పాటు భూసేకరణ సమస్యలతో గడిచిన రెండేళ్లలో ప్రాజెక్టుల పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధ్యం కాలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాధాన్యత, అప్రాధాన్యత కేటగిరీలు కలిపి 2024–25లో రూ.6,577.8 కోట్ల విలులైన పనులు చేయాల్సి ఉండగా, రూ.8,049.56 కోట్ల పనులు జరిగాయి. అయితే 2025–26లో రూ.17,525 కోట్లు విలువైన పనులు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.3,284 కోట్లు విలువైన పనులే జరిగాయి. గత రెండేళ్లలో మొత్తం రూ.24,103 కోట్ల విలువైన పనులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, రూ.11,333 కోట్ల పనులే జరిగాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి 2024–25 బడ్జెట్లో రూ.12,845 కోట్లను కేటాయించగా, రూ.6,946.66 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇక 2025–26లో రూ.11,786 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా, ఇప్పటి వరకు రూ.4,450 కోట్లు విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పెండింగ్ బిల్లుల చెల్లింపులకే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సింహభాగం ఖర్చవడం గమనార్హం. కాగా రెండేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి కొరవడింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతలు పథకాలు మినహా ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తిగా పడకేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే నాటికి రూ.9,527.38 కోట్ల నిధులను విడుదల చేస్తే కొత్తగా మరో 3,94,899 ఎకరాల ఆయకట్టును సృష్టించగలమని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. కానీ ప్రస్తుత వేగంతోనే పనులు జరిగితే మాత్రం సగం లక్ష్యాన్ని అందుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మాణం చివర్లో ఉన్నా పురోగతి సున్నా.. నిర్మాణం చివరి దశలో ఉండి అతి తక్కువ వ్యయంతో పూర్తయ్యే 6 ప్రాజెక్టులను ‘కేటగిరీ–ఏ’ పేరుతో అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుల కింద చేర్చి 2025 మార్చి 31 నాటికి వాటి కింద 100 శాతం మిగులు ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆరు ప్రాజెక్టుల కింద మొత్తం 4.44 లక్షల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందే 3.96 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మిగిలిన 47,882 ఎకరాల ఆయకట్టుకు 2025 మార్చి 31లోగా సాగునీరు అందించాల్సి ఉండగా, అప్పటికి కేవలం 5 వేల ఎకరాలు, ఆ తర్వాత 2025–26లో ఇప్పటివరకు మరో 5,200 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయి. ఒక్క నిల్వాయి ప్రాజెక్టు కిందే లక్ష్యం మేరకు 5 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. పాలెంవాగు కింద 2,632 ఎకరాలు, సదర్మట్ బరాజ్ కింద 18,016 ఎకరాలు, పిప్రి ఎత్తిపోతల కింద 4,214 ఎకరాలకు గాను ఇప్పటివరకు ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదు. మత్తడివాగు అదనపు పనుల కింద 1,200 ఎకరాలకు గాను ఇప్పటివరకు 700 ఎకరాలు, ఎస్ఆర్ఎస్పీ రెండో దశ కింద 16,775 వేల ఎకరాలకు గాను 4,500 ఎకరాలే సాగులోకి వచ్చాయి. ఈ ఆరు ప్రాజెక్టుల పూర్తికి రెండేళ్లలో రూ.352 కోట్లను ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.121 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ముందుకు సాగని కేటగిరీ–బీ ప్రాజెక్టులు.. కేటగిరీ–ఏ తర్వాతి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో కేటగిరీ–బీ, కేటగిరీ–బీ కాంపోనెంట్–ఏ, ఇతర ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం విభజించింది. కేటగిరీ–బీ కింద గోదావరి బేసిన్ పరిధిలోని కాళేశ్వరం, మొడికుంటవాగు, లోయర్ పెన్‌గంగా, ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను చేర్చి 2024–25 నాటికే 2.4 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 1.12 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. ఇక 2025–26లో వీటి కింద మరో 2.23 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 16 వేల ఎకరాలే సాగులోకి వచ్చాయి. గత రెండేళ్లలో రూ.7,582 కోట్లను ఈ ప్రాజెక్టులపై వెచ్చించాలని లక్ష్యం కాగా, రూ.1,713 కోట్ల వ్యయం మాత్రమే జరిగింది. – కేటగిరీ–బీ కాంపోనెంట్–ఏ కింద కృష్ణా బేసిన్‌లోని కోయిల్‌సాగర్, రాజీవ్ బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేర్చింది. వీటి కింద 2024–25లో 1.09 లక్షల ఎకరాలకు గాను 41,818 ఎకరాలు, 2025–26లో 2.26 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 8,454 ఎకరాలే సాగులోకి వచ్చాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టులపై రూ.9,327 కోట్లను ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.1,813 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. – ప్రాధాన్యత జాబితాలో లేని ఇతర ప్రాజెక్టుల కింద పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, ఇందిరమ్మ ఫ్లడ్‌ఫ్లో కెనాల్, గట్టు ఎత్తిపోతలు, నారాయణ్‌పేట–కొడంగల్, ముత్యాల బ్రాంచ్ కాల్వ, జాన్‌పహాడ్ బ్రాంచ్ కాల్వ ప్రాజెక్టులను చేర్చారు. వీటి కింద 2024–25లో 23 వేల ఎకరాలు, 2025–26లో 2 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, వరుసగా 3 వేలు, 5 వేల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయి. వచ్చిన ఆయకట్టు సీతారామ కిందే.. కేటగిరీ–బీ, కేటగిరీ–బీ కాంపోనెంట్–ఏ కింద కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఉన్న ప్రాజెక్టుల కింద 2024–25లో మొత్తం 2.81 లక్షల ఎకరాలకు గాను 1.54 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇందులో 1.11 లక్షల ఎకరాలు ఒక్క సీతారామ ఎత్తిపోతలు పథకం కిందే సాగులోకి వచ్చాయి. ఇక 2025–26లో మొత్తం 4.5 లక్షల ఎకరాలకు గాను 24,454 ఎకరాలే సాగులోకి వచ్చాయి. మేజర్ ప్రాజెక్టుల కింద వచ్చింది 39 లక్షల ఎకరాలే.. పాత మేజర్ ప్రాజెక్టుల కింద ప్రతిపాదించిన 21.23 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టి పూర్తిగా కాగా..మరో 2.64 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు గాను 2.47 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. నిర్మాణంలోని మేజర్ ప్రాజెక్టుల కింద మొత్తం 70.54 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా, ఇప్పటివరకు 18.37లక్షల ఎకరాల ఆయకుట్ట అభివృద్ధి మాత్రమే జరిగింది. వీటి కింద 28 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రతిపాదించగా, 22.67 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. మేజర్ ప్రాజెక్టుల కింద మొత్తం 91.77 లక్షల ఎకరాల ప్రతిపాదిత కొత్త ఆయకట్టుకు గాను 39.6 లక్షల ఎకరాల అభివృద్ధి మాత్రమే జరిగింది. మొత్తం 28.96 లక్షల ఎకరాల స్థిరీకరణకు గాను 22.67 ఎకరాల స్థిరీకరణ జరిగింది. పాత మీడియం ప్రాజెక్టుల కింద 3.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గాను 3.18 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధి జరగగా, నిర్మాణంలోని మీడియం ప్రాజెక్టుల కింద 1.69 లక్షల ఎకరాలకు గాను 91 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయింది. -
రాష్ట్రంలో సాగునీటి పథకాలకు రూ.50 వేల కోట్లు
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో పెండింగ్, నూతన సాగునీటి పథకాలకు ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ముఖ్య మంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాయచూరు నగరంలో రూ.84 కోట్లతో నిర్మించిన 550 పడకల ఆస్పత్రిని ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సాగునీటి పథకాలకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామన్నారు. నందవాడిగి సాగునీటి పథకానికి రూ.270 కోట్లు కేటాయించామన్నారు. ఎన్ఆర్ బీసీ కాలువ 95వ మైలు నుంచి 145 మైలు వరకు విస్తరణ పనులకు టెండర్లు పూర్తి అయ్యన్నారు. తుంగభద్ర డ్యాంలో పూడికతీతకు చర్యలు తీసుకోవడంతోపాటు వరద కాలువ నిర్మాణానికి గ్లోబల్ టెండర్ పిలిచామన్నారు. రాయచూరులో ఐఐటీ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. రహదారుల అభివృద్ధికి రూ.75 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.83 కోట్లు కేటాయించామన్నారు .రాయచూరు నగరంలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటుకు రూ.65 కోట్లు, ఇతర పనులకు రూ.66 కోట్లు మంజూరు చేశామన్నారు. హై-కా ప్రాంతంలోని రాయచూరు, బళ్లారి, యాదగిరి, కొప్పళ, గుల్బర్గ, బీదర్ జిల్లాల అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయింపు, 371జే ఆర్టికల్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 12 వైద్య కళశాలలు మంజూరు చేశామని, గ్రామీణ ప్రాంతలో పేదలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలూ కల్పించామన్నారు. రాయచూరు జిల్లాకు 24 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. చెరుకు టన్నుకు రూ.250 అధికంగా ధరలు ప్రకటించామని, మొక్కజొన్నకు రూ.2700 ప్రకటించామని వివరించారు. ఉల్లిగడ్డ పంటలో నష్ట పోయిన రైతులకు హెక్టారుకు రూ.9 వేలు పరిహారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణుప్రకాశ పాటిల్, రాయచూరు ఎంపీ బీవీ.నాయక్, ఎమ్మెల్యేలు శివరాజ పాటిల్, ప్రతాప పాటిల్, హంపయ్య నాయక్, మానప్ప వజల్, హంపనగౌడ, ఎమ్మెల్సీలు అమరనాథ పాటిల్, బోసురాజు, జెడ్పీ అధ్యక్షురాలు సరోజమ్మ, నగరసభ అధ్యక్షురాలు మహాదేవి, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, అమరేగౌడ, సయ్యద్ యాసిన్, రాజా రాయప్ప నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు వసంతకుమార్, కలెక్టర్ శశికాంత సింథల్, సీఈఓ విజయ జ్యోత్న్స, ఎస్పీ నాగరాజ పాల్గొన్నారు.


