రాష్ట్రంలో సాగునీటి పథకాలకు రూ.50 వేల కోట్లు
రాష్ట్రంలో పెండింగ్, నూతన సాగునీటి పథకాలకు ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో పెండింగ్, నూతన సాగునీటి పథకాలకు ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ముఖ్య మంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాయచూరు నగరంలో రూ.84 కోట్లతో నిర్మించిన 550 పడకల ఆస్పత్రిని ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సాగునీటి పథకాలకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామన్నారు. నందవాడిగి సాగునీటి పథకానికి రూ.270 కోట్లు కేటాయించామన్నారు. ఎన్‌ఆర్ బీసీ కాలువ 95వ మైలు నుంచి 145 మైలు వరకు విస్తరణ పనులకు టెండర్లు పూర్తి అయ్యన్నారు. తుంగభద్ర డ్యాంలో పూడికతీతకు చర్యలు తీసుకోవడంతోపాటు వరద కాలువ నిర్మాణానికి గ్లోబల్ టెండర్ పిలిచామన్నారు.
రాయచూరులో ఐఐటీ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. రహదారుల అభివృద్ధికి రూ.75 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.83 కోట్లు కేటాయించామన్నారు .రాయచూరు నగరంలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటుకు రూ.65 కోట్లు, ఇతర పనులకు రూ.66 కోట్లు మంజూరు చేశామన్నారు. హై-కా ప్రాంతంలోని రాయచూరు, బళ్లారి, యాదగిరి, కొప్పళ, గుల్బర్గ, బీదర్ జిల్లాల అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయింపు, 371జే ఆర్టికల్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 12 వైద్య కళశాలలు మంజూరు చేశామని, గ్రామీణ ప్రాంతలో పేదలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలూ కల్పించామన్నారు. రాయచూరు జిల్లాకు 24 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. చెరుకు టన్నుకు రూ.250 అధికంగా ధరలు ప్రకటించామని, మొక్కజొన్నకు రూ.2700 ప్రకటించామని వివరించారు. ఉల్లిగడ్డ పంటలో నష్ట పోయిన రైతులకు హెక్టారుకు రూ.9 వేలు పరిహారం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణుప్రకాశ పాటిల్, రాయచూరు ఎంపీ బీవీ.నాయక్, ఎమ్మెల్యేలు శివరాజ పాటిల్, ప్రతాప పాటిల్, హంపయ్య నాయక్, మానప్ప వజల్, హంపనగౌడ, ఎమ్మెల్సీలు అమరనాథ పాటిల్, బోసురాజు, జెడ్పీ అధ్యక్షురాలు సరోజమ్మ, నగరసభ అధ్యక్షురాలు మహాదేవి, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, అమరేగౌడ, సయ్యద్ యాసిన్, రాజా రాయప్ప నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు వసంతకుమార్, కలెక్టర్ శశికాంత సింథల్, సీఈఓ విజయ జ్యోత్న్స, ఎస్‌పీ నాగరాజ పాల్గొన్నారు.


