
2023–24తో పోల్చితే 3 పులులు అధికం
సత్ఫలితాలు ఇస్తున్న అటవీ శాఖ చర్యలు
పెరుగుతున్న ఆడ పులుల సంతతి
అచ్చంపేట: నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో ప్రస్తుతం 36 పులులు, 2 పులి పిల్లలు ఉన్నాయి. ఇందులో 13 మగ, 20 ఆడ పులులు కాగా.. మరొకటి గుర్తించాల్సి ఉంది. అటవీశాఖ లెక్కల ప్రకారం 2023–24లో 33 పెద్దపులులు ఉండగా.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) 2024–25 ఫేజ్–4 మానిటరింగ్‌లో భాగంగా ఆటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పులుల పర్యవేక్షణ సర్వే ప్రకారం 36కు చేరింది. 2019 నుంచి వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఇక్కడ పెరుగుతున్న పులుల సంతతిలో ఆడ పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో మరో రెండు, మూడేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా పులులు వేటాడి తమ ఆహారాన్ని సులభంగా సాధించుకునేలా జింకలు, దుప్పులు, గడ్డి క్షేత్రాలు, ఇతర జంతువులను పెంచాల్సిన అవసరం ఉంది.
గణన ఇలా..
ఏటీఆర్ పరిధిలోని పది రేంజ్‌లను నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. 2024, డిసెంబర్ 20 నుంచి 2025, మే 15వ తేదీల్లో 1,594 కెమెరా ట్రాప్‌ల ద్వారా పాదముద్రలను పరిశీలించారు. 797 లొకేషన్లలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక కెమెరా ట్రాప్ రికార్డ్ చేసి పులులకు సంబంధించి డేటాను విశ్లేషించారు. నాలుగు నెలల కాలంలో పులుల అడుగులు, ముద్రలు, విసర్జనలు, స్క్రాప్, రేక్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు.
పెరుగుతున్న ఆడ పులులు
నల్లమల అభయారణ్య ప్రాంతం 2,611.39 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 2,166,37 చదరపు కి.మీ. అభయారణ్యం, 445.02 చదరపు కి.మీ. బఫర్‌జోన్‌గా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వుగా ఏటీఆర్ నిలిచింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు, కృష్ణానది జలపాతాలు, క్రూరమృగాలు, జంతువుల సందడికి నిలయం. ఈ అడవుల్లో జీవ వైవిధ్యానికి పెద్దపులులు, చిరుతలే కీలకం. పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలతో అమ్రాబాద్ అభయారణ్యంలో ఏటేటా పులులు, చిరుతల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 200లకు పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది.

సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. ఏటీఆర్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 20 ఆడపులులు.. రెండు పులి పిల్లలు ఉన్నాయి. సాధారణంగా పెద్దపులి దట్టమైన అటవీ ప్రాంతంలో చెట్లపై గుర్తులు, మూత్ర విసర్జన చేసి తన హద్దులను ఏర్పాటు చేసుకుంటుంది. ఎంచుకున్న సరిహద్దులో 25 చదరపు కిలోమీటర్ల మేర సంచరిస్తుంది. ప్రస్తుతం ఏటీఆర్‌లో పరహా, బౌరమ్మ, తారా, ఎఫ్–53, ఎం–19 పేర్లతో పులులకు నామకరణం చేశారు. పులికి సిగ్గెక్కువ కావడంతో ఒంటరిగా తిరిగేందుకు ఇష్టపడుతుంది. పెద్దపులి (Tiger) శాఖాహార జంతువులను వేటాడి ఆహారంగా తీసుకుంటుంది.
జనావాసాల తరలింపుపై కార్యాచరణ
ఏటీఆర్‌లో పెద్దపులులకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. కోర్ ఏరియాలోని జనావాసాలను బయటకు తరలించేందుకు ఇప్పటికే తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, కొమ్మనపెంట గ్రామాలను పెద్దకొత్తపల్లి మండలం బాకారం గ్రామ సమీపంలో అటవీశాఖ స్థలాన్ని ఎంపిక చేసి అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశలో వట్టువర్లపల్లి, తాటిగుండాలు, మరి కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి ఇతర చోట్లకు తరలించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఆయా కుటుంబాలకు ప్యాకేజీలు అందించే ఏర్పాటు చేస్తున్నారు.
పులుల సంతానోత్పత్తికి అనువైన రోజులు కావడంతో జూలై నుంచి సెప్టెంబర్ వరకు వాటి ఏకాంతతకు భంగం కలగొద్దని నిషేధాజ్ఞలు విధించారు. ఈ మూడు నెలల పాటు అటవీ ప్రాంతంలోకి పర్యాటకులు, ఇతరులెవరినీ అనుమంతిచరు. ఏటీఆర్‌ను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు చేశారు. పది కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి అభివృద్ధి, నిర్మాణాలు చేపట్టాలన్నా ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా అవసరం.
పులుల వృద్ధికి ఏటీఆర్ అనుకూలం
అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో జీవవైవిధ్యంతో పాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 36 పులులు ఉన్నాయి. పెరుగుదల మా శాఖ ప్రణాళిక బద్ధంగా చేపట్టిన చర్యలకు ఫలితం. ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఈ అభయారణ్యం ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది.
– గోపిడి రోహిత్‌రెడ్డి, డీఎఫ్‌ఓ
గుర్తింపు ఇలా..
పెద్ద పులులను ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫొటోగ్రాఫ్‌ల డేటాబేస్‌తో పాటు పులులు చారల ఆధారంగా మ్యాచ్ చేస్తారు
మగ, ఆడ వాటిని వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు
పులులను గుర్తించాక వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు
ఏ రెండు పులుల చారలు ఒకే విధంగా ఉండవు
మనుషుల వేలి ముద్రల మాదిరిగానే వాటి స్ట్రైప్ ప్యాటర్న్ ప్రతీ పులికి ప్రత్యేకంగా ఉంటుంది
చదవండి: చీరలు కట్టి.. చెట్లుగా మార్చారు!