ఊపిరి పీల్చుకున్న ప్రజలు
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లాలోని ఏజన్సీ ప్రాంతంలో 8 రోజులపాటు సంచరించిన పెద్దపులి ఎట్టకేలకు బుధవారం అడవిలోకి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు. బుట్టాయగూడెం మండలం లంకాలపల్లి శివారులో అడవిలో చేరిన చివరి పాదముద్రలు గుర్తించామని వైల్డ్‌లైఫ్ అధికారులు చెప్పారు. ఈనెల 21న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల సమీపంలో ఆవులపై దాడి చేసిన పెద్దపులి.. అనంతరం ఏపీలోని బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మగుడి మార్గంలో కొందరు గిరిజనులకు కనిపించింది.
అదేరోజు అంతర్వేదిగూడెంలో రెండు ఆవులను, 22న నాగులగూడెం సమీపంలోని ఐదు ఆవులను హతమార్చింది. అలాగే 24న గురుగుమిల్లి, కోటనాగవరం గ్రామాల్లో 2 గేదెలపై దాడి చేసి చంపింది. 25న బుట్టాయగూడెం మండలం అల్లికాల్వ మీదుగా రాయిగూడెం చేరుకుని అక్కడ గేదె దూడను చంపింది. అదేరోజు కొయ్యలగూడెం మండలం బిల్లిమిల్లి, దిప్పకాయలపాడు చేరుకుని అక్కడ ఆవులపై దాడి చేసి చంపింది.
26న మళ్లీ రావిగూడెం చేరుకుని గేదె దూడను చంపింది. అక్కడి నుంచి కండ్రికగూడెం, అమ్మపాలెం గ్రామాల్లో 2 గేదెలను హతమార్చింది. 27న లంకపల్లి రామనర్సాపురం మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అయితే పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా, బుధవారం మధ్యాహ్నం లంకపల్లి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లినట్లు గుర్తించామని అటవీ అధికారులు చెప్పారు. దీంతో ఏజెన్సీ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు.


