ఈనెల 19 నుంచి 25 వరకు నిర్వహణ
40 వేలకు పైగా కెమెరా ట్రాప్‌ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో.. పెద్దపులుల గణన ముగిసింది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ)–2026లో భాగంగా.. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 25 వరకు శాస్త్రీయ పద్ధతుల్లో ఈ సర్వే చేపట్టారు. సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లాను మినహాయించి, 32 జిల్లాల్లోని అన్ని బీట్‌లలో సర్వే పూర్తి చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు.
ఈ సర్వేలో భాగంగా 15 కిలోమీటర్ల మేర కార్నివోర్ సైన్ సర్వే, రోజుకు 2 కిలోమీటర్ల ట్రాన్సెక్ట్ సర్వే నిర్వహించి అటవీ వృక్షజాలం, ఆహార జంతువుల సాంద్రతను అంచనా వేశారు. ప్రాథమిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా పులులు, ఇతర మాంసాహార జంతువుల ఉనికికి సంబంధించి 994 ఆధారాలు లభించాయి.
అలాగే 552 పెద్ద శాకాహార జంతువులకు సంబంధించిన ఆధారాలను అధికారులు గుర్తించారు. ఇతర వన్యప్రాణుల ఆనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి. ఈ సర్వేలో 4,512 మంది అటవీ శాఖ సిబ్బందితో పాటు దేశ నలుమూలల నుంచి వచి్చన 1,677 మంది వలంటీర్లు పాల్గొన్నారు.
రెండు జోన్లుగా విభజన
పెద్దపులుల గణన ప్రక్రియ కోసం.. రాష్ట్ర ఉత్తర భాగాన్ని కవ్వాల్, దక్షిణ భాగాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లుగా విభజించారు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హెరేమత్‌లు ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించారు.
గణనలో సాంకేతికత
ఈసారి గణనలో సాంకేతికత వినియోగం, వలంటీర్ల భాగస్వామ్యం, శాకాహార జంతువుల లెక్కింపుతో సహా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నమూనా ప్లాట్లలో వృక్షసంపద, మానవ ప్రభావం, ఆహారం సమృద్ధిని కూడా అంచనా వేశారు. ఇదే సమయంలో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి కుక్కలు వంటి ఇతర జంతువులు, ఆవాసాల నాణ్యత, ఆహార లభ్యతను కూడా లెక్కించారు. ఇందుకోసం అత్యంత హై–ప్రొఫైల్ దశలో గ్రిడ్–ఆధారిత వ్యవస్థలో 40 వేలకు పైగా కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో నిర్వహించిన ఈ సర్వే సమయంలో కొన్ని విషాదాలు చోటుచేసుకున్నాయి. విధి నిర్వహణలో ఒక అటవీ వాచర్ గుండె పోటుతో మృతి చెందగా, ఎలుగుబంటి దాడిలో ఒకరు గాయపడ్డారు. మరో వలంటీర్‌కు కాలు విరిగింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అటవీ సిబ్బంది, వలంటీర్లు సమన్వయంతో పనిచేసి సర్వేను నిర్దేశిత సమయంలో పూర్తి చేసినట్టు అటవీ అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా.. నాలుగేళ్లకోసారి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాల సంయుక్త ఆధ్వర్యంలో ఏఐటీఈ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల సర్వేగా గుర్తింపు లభించడం విశేషం.


