మేడారం జాతర సమయంలో గద్దెలపై పడిగల ప్రతిష్టాపన
పడిగలో కోయ ఇలవేల్పులు, ఆదివాసీల వంశ చరిత్ర నిక్షిప్తం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరంటే గుర్తొచ్చే గద్దెలు, బంగారం (బెల్లం), ఒడి బియ్యం వంటివి చాలా మందికి తెలుసు. కానీ కళ్లెదుటే కనిపిస్తున్నా ఆదివాసేతర భక్తులకు అంతగా తెలియని మరో ముఖ్యమైన అంశం పడిగలు. ఆదివాసీ జాతరల్లో పడిగల ప్రాముఖ్యత ఏంటి? వాటిని ఎక్కడ, ఎలా తయారు చేస్తారనే అంశాలు ‘సాక్షి’పాఠకుల కోసం..
చరిత్రను తెలిపే పడిగలు..
ఆదివాసీల గొట్టు గోత్రాలు, ఇలవేల్పులు, వీరగాథలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా కథలు, పాటల రూపంలో మౌఖికంగా అందుబాటులో ఉంది. కొన్నిచోట్ల గోడలపై బొమ్మల రూపంలో చెప్పే ఆనవాయితీ కూడా ఉంది. తర్వాత కాలంలో ఆదివాసీల వంశచరిత్ర, ఇలవేల్పుల ఔన్నత్యాన్ని చిహ్నాలు, బొమ్మలతో తెలియజేసేలా రూపొందించిన వ్రస్తాన్నే పడిగ (దేవరగుడ్డలు) అంటారు. వాటిని తయారు చేసే తోలెం వంశీయుల కుటుంబం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం ఎలుకలగూడెంలో ఉంది.
తళపతి, అర్తిబిడ్డలతో చర్చించి..
ఆదివాసీల్లో ఒక తెగకు సంబంధించిన ఇలవేల్పు, ఆ తెగ వంశ చరిత్రను తెలిపే వ్యక్తిని అర్తిబిడ్డ (ఉదా: పద్మశ్రీ సకిని రామచంద్రయ్య) అంటారు. ఆ తెగకు సంబంధించిన ఇలవేల్పుకు పూజలు చేసే వ్యక్తిని తళపతి అంటారు. పడిగ తయారీకి ముందు తళపతి, అర్తిబిడ్డలు తోలెం కుటుంబాన్ని కలుస్తారు. పాటలు, కథల రూపంలో తమ తెగకు సంబంధించిన వంశ చరిత్ర, ఇలవేల్పులకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఇందులో వచి్చన వివరాల ఆధారంగా పడిగలపై ఏ చిహ్నాలు, ఏ జంతువులు, ఏ చెట్లు, ఏ పక్షులు, ఏ నక్షత్రాలకు చెందిన గుర్తులు, బొమ్మలు ఏ వరుసలో అమర్చాలనే అంశంపై స్పష్టత వస్తుంది.
దేవనిష్టతో తయారీ..
పడిగ తయారీపై స్పష్టత వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహించి ‘దేవనిష్ట’లో ఉంటూ ఎర్రని వస్త్రంపై ఆయా చిహ్నాలు, బొమ్మలను ఒక క్రమపద్ధతిలో కుడతారు‡. ఒక్కో బొమ్మకు, ఒక్కో జంతువుకు ఏ రంగు ఉపయోగించాలి, ఏ సమయంలో కుట్టాలనే అంశాలపైనా విధివిధానాలు ఉన్నాయి. మొత్తం ఐదు దశల్లో పడిగను తయారు చేస్తారు. ఒకప్పుడు మొత్తం పనిని చేతికుట్టుతోనే చేసేవారు. కాలక్రమంలో కుట్టు మిషన్లు ఉపయోగిస్తున్నారు.
తొలి సమావేశం నుంచి తుది పడిగె తయారయ్యే వరకు సుమారు మూడు నెలలు పడుతుంది. ఒక్కో పడిగకు సగటున రూ.40 నుంచి రూ.50 వేల చొప్పున ఖర్చవుతుంది. ఒకసారి తయారు చేసిన పడిగ కనీసం పదేళ్లపాటు ఉంటుంది. ఈ జాతర సీజన్‌లో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన భక్తుల కోసం 35 వరకు పడిగలను తోలెం కుటుంబం తయారు చేసింది.
తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో ఉంటున్న ఆదివాసీలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ, జంపన్న, సూరగొండయ్య, ఎడమరాజు, భీమరేడు, కాటరాజు, ఉయ్యాలమ్మ, దారెల్లి, ముసలమ్మ ఇలా 100కు పైగా ‘శక్తు’లను ఇలవేల్పులుగా కొలుస్తారు. ఇందుకోసం 170కి పైగా పడిగలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
ఇద్దరమే ఉన్నాం
తెలంగాణ మొత్తం మీద గత ఐదుతరాలుగా మా కుటుంబం ఒక్కటే పడిగలు తయారుచేస్తోంది. ప్రస్తుతం నేను, మా అన్న తోలెం వెంకటేశ్వర్లు ఈ పని చేస్తున్నాం. రెండేళ్లకు ఓసారి జాతర సమయంలోనే మాకు ఈ పని దొరుకుతుంది. మిగిలిన రోజుల్లో వ్యవసాయం చేసుకుంటున్నాం. భవిష్యత్‌లో ఎంతమంది ఇటువైపు వస్తారో తెలియదు. – తోలెం కల్యాణ్, పడిగ తయారీదారు


