సమావేశంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు తదితరులు
అంతా సమన్వయంతో ముందుకెళ్లాలని తీర్మానం
ఎన్నికల ఇన్‌చార్జీలతో పార్టీ ముఖ్యనేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మంగళవారం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో యావత్ పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మె జారిటీ స్థానాలు గెలిచేలా అన్నిస్థాయిల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని తీర్మానించింది. బుధ, గురువారాల్లో నామినేషన్ల దాఖలు సమయం ముగియనున్నందున వెంటనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
తొలుత నోవాటెల్‌లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జి అభయ్ పాటిల్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులతో జాతీయ నాయకత్వం నియమించిన ఇతర రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ ఎన్నికల సహ ఇన్‌చార్జీలు సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయేదాకా నోవాటెల్‌లోనే రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జీలతో పార్టీ నేతలు రాంచందర్ రావు, కిషన్‌రెడ్డి, అభయ్ పాటిల్, డీకే అరుణ, కె.లక్ష్మణ్ ఇతర ముఖ్యనేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలతో రెండేసి ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున బహిరంగ సభ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు.
విజయసంకల్ప సమావేశాలు: రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళామోర్చా, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో విజయసంకల్ప సమావేశాలు జరిగాయి. మహిళా మోర్చా సన్నాహక సమావేశంలో రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వీరేందర్ గౌడ్‌తోపాటు ఎన్నికల కో ఇన్‌చార్జి, రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణామి, మరో కో–ఇన్‌చార్జి, ఎంపీ రేఖాశర్మ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు.


