ఈ రెండు కోణాల్లో సంతోష్ కుమార్ విచారణ
ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వంతు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను విచారించింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన రాత్రి 10.50 గంటలకు తిరిగి వెళ్లారు. ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక నిందితుడు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు సుదీర్ఘ కాలం ఆయా విభాగాల్లో పని చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎక్స్‌టెన్షన్ ద్వారా విధులు నిర్వర్తించారు. కాగా ఈ ఇద్దరు అధికారుల ఎక్స్‌టెన్షన్‌తో పాటు ఎస్‌ఐబీ, టాస్‌్కఫోర్స్‌ల్లో పని చేసిన మరికొందరి పోస్టింగుల వెనుక సంతోష్‌కుమార్ పాత్ర ఉన్నట్లుగా సిట్ అనుమానిస్తున్నట్లు తెలిసింది.
ఈ కోణంలోనే కొన్ని కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయా అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఎవరు తయారు చేయించారు? పోలీసు విభాగంతో పాటు హోం సెక్రటరీ ఆమోదం పొందేలా ఎవరు చేశారు? వీటిలో మీ పాత్ర ఏమిటంటూ ఆరా తీసినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. అయితే ఆయా అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంతోష్ కుమార్ చెప్పినట్లు సమాచారం.
ఫోన్లు ట్యాప్ చేయించారనే కోణంలో..
మరోపక్క 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సమయంలో కొన్ని ఫోన్ నంబర్లను ఎంపిక చేసిన సంతోష్ కుమార్ వాటిని ట్యాప్ చేయించడంతో పాటు నిఘా ఉంచినట్లుగా సిట్ అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర వాంగ్మూలం నమోదు చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సంతోష్‌కుమార్‌కు స్పష్టం చేసింది.
ఇలావుండగా త్వరలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కూడా సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. తనతో పాటు తన భర్త, కీలక అనుచరుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆమె గతంలో పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను విచారించాలని సిట్ భావిస్తోంది.
మొక్కల పంపిణీకి యత్నం
బంజారాహిల్స్: సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో.. పోలీసు అధికారులకు, పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చిన వారికి తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండేషన్ తరఫున మొక్కలు పంపిణీ చేయాలని సంతోష్ కుమార్ భావించారు. దీంతో కార్యకర్తలు ఆటో నిండా పూల మొక్కలు తీసుకుని పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు కొద్ది దూరంలో మొక్కలు పంచేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆటోను సీజ్ చేశారు.


