సాయంత్రం గద్దెలపైకి చేరనున్న సారలమ్మ
భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు..
ఇప్పటికే 45 లక్షల మందికి పైగా మొక్కులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ /మహబూబాబాద్: తెలంగాణ కుంభమేళా, ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరనుంది. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా మొక్కు లు చెల్లించారు.
పూజారులు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచి మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చే లోపు ఏటూరునాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు.
మేడారం బయల్దేరిన పగిడిద్దరాజు
సమ్మక్కను వివాహం చేసుకునేందుకు పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పెళ్లి కుమారుడిగా ముస్తాబై మంగళవారం మేడారం బాటపట్టారు. అత్తగారిల్లు మేడారం వెళ్లేందుకు సమ్మక్క వంశీయులు పగిడిద్దరాజు వంశమైన పెనక వంశీయులకు పసుపు, కుంకుమ ఇస్తారు. దీన్ని తీసుకొని వారు పూనుగొండ్లకు బయల్దేరుతారు.
ఇదే సమయంలో పూనుగొండ్లలోని పెనక వంశీయులైన వెంకటేశ్వర్లు ఇంట్లో ఉన్న పూజా సామగ్రి, పానుపు, పడిగెలను శుద్ధి చేశారు. అనంతరం (నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, మువ్వలు) సిద్ధం చేసి తళపతి ఇంట్లో పెనక వంశీయులు ప్రధాన పూజారి రాజేశ్వర్, బుచ్చిరాములు, పురుషోత్తం, రాహుల్, వెంకటేశ్, సురేందర్, సమ్మయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆదివాసీ సంప్రదాయంలో మొక్కులు సమర్పించి దేవునిగుట్ట నుంచి వనం (వెదురు చెట్టు) తీసుకుని గ్రామ పొలిమేరలో పడిగెను కలిపి ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొచ్చారు. వనాన్ని తాకితే మంచి జరుగుతుందనే నమ్మకం. దీంతో భక్తులు వనాన్ని తాకడానికి పోటీ పడ్డారు.
పగిడిద్దరాజును తీసుకెళ్లేందుకువచ్చిన మంత్రి, అధికారులు
సమ్మక్క తరçఫున గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతోపాటు మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి, సమ్మక్క వంశీయులు పూనుగొండ్లకు వచ్చారు. తంతు ముగిశాక మేడారానికి పగిడిద్దరాజు (ప్రతిమ)ను తీసుకొని కాలి నడకన మేడారం బయల్దేరారు. మంగళవారం రాత్రి వరకు కర్లపల్లి లక్ష్మీపురం గ్రామంలో బస ఏర్పాట్లు చేశారు.
బుధవారం ఉదయం రాళ్లవాగులో స్నానం చేసి సాయంత్రానికి మేడారం చేరుకోనున్నారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకొచ్చే వేడుకను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం భక్తులతో నిండిపోనుంది. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
జాతరను వైభవంగా జరుపుకొందాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా కొలిచే సమ్మక్క–సారలమ్మ జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే జాతరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘనంగా ఏర్పాట్లు చేసి నిధులు వెచ్చించామని తెలిపారు.
రూ. 250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతోపాటు సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు.
కాగా, 13 వేల మంది పోలీసులతో జాతర భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచే మేడారం భక్తజనంతో కిక్కిరిసింది.


