అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అడ్డంకులు ఎందుకు?
దేశంలో మహిళాశక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది
రాజకీయ వ్యవస్థలను బీజేపీ నీరుగారుస్తోంది
కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులు, పేదల ప్రయోజనాలు తాకట్టు
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంకు ఆదరణ పెరుగుతోంది
‘సాక్షి’ ఇంటర్వ్యూలోసీపీఎం అగ్ర నాయకురాలు బృందా కారత్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో అమలుచేస్తున్న ప్రైవేటీకరణ, కాషాయీకరణ విధానాలతో రాజకీయంగానూ పెనుమార్పులు సంభవిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా మొత్తం రాజకీయ వ్యవస్థనే క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను ఓ క్రమపద్ధతిలో దెబ్బతీస్తూ పార్లమెంటు వ్యవస్థల పనితీరును తగ్గించడం, విపక్ష గొంతులను అణిచివేయడం, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని చెప్పారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన బృందా కారత్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...
మహిళలపై పెరుగుతున్న దమనకాండ
12 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా మహిళలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రోద్బలంతో బీజేపీ ప్రభుత్వం వివిధ చట్టాల్లో తెస్తున్న మార్పుచేర్పులతో దేశంలో మహిళాశక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు రూపొందించి మహిళలు, కార్మికులు, రైతులు, పేదల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.
కార్మిక చట్టాల తొలగింపు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, సంక్షేమ పథకాల్లో కోతలే ఇందుకు నిదర్శనం. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. కులం, మతం ఆధారంగా కూడా మహిళల పట్ల హింస పెచ్చరిల్లే అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో మహిళలను అణగదొక్కేందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనుస్మృతిని అమలు చేస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో అంకిత్ భండారి కేసులో దోషులను ఇప్పటికీ పట్టుకోలేదు. బీజేపీ నేత కుమారుడు ప్రత్యక్షంగా అంకిత్ భండారి హత్యకేసులో ఉన్నట్లు తేలినా చర్యల్లేవు. డబుల్ ఇంజన్ సర్కార్‌గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో మహిళలపై దాడులు భయపెడుతున్నాయి. మనువాదం ప్రకారం మహిళలను అన్ని రంగాల్లో అణగదొక్కడం, వేధించడమే ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ విధానం.
ఓటు రాజకీయాలు..
దేశంలో మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ ఓటు రాజకీయాలను నడుపుతోంది. ఈ రిజర్వేషన్ బిల్లు అనేది మోదీ చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్కులాంటిది. 2013లోనే చెక్కు ఇచ్చారు... కానీ సంతకం 2023లో చేశారు. అయితే అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియదు. మహిళలు జనాభాలో సగం ఉన్నప్పుడు, అధికార నిర్ణయ వ్యవస్థల్లో వారి ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య వైఫల్యమే.
ఇప్పుడు జనగణన, నియోజకవర్గాల పునరి్వభజన అంటూ వాయిదా వేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇన్ని అడ్డంకులు ఎందుకు? ఇప్పటికే దశాబ్దకాలానికిపైగా ఈ బిల్లు కోసం ఎదురుచూస్తున్న మహిళలు మోదీ ప్రభుత్వ సాగదీత వ్యవహారంతో ఇంకెన్నేళ్లు వేచి చూడాలి.
రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్ర
సీపీఎం దేశంలో బలహీనపడిందనే వాదన సరికాదు. ప్రస్తుతం దేశంలో మొత్తం రాజకీయ వ్యవస్థనే క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తోంది. దీనికోసం ఎంతకైనా తెగిస్తోంది.
పార్లమెంటు పనితీరును తగ్గించడం, విపక్ష స్వరాలను అణిచివేయడం, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. సీపీఎం ఎదుర్కొంటున్న పరిస్థితి కేవలం ఎన్నికల పరాజయాల సమస్య కాదు. మౌలిక ప్రజాస్వామ్య రాజకీయాలపై సాగుతున్న దాడిలో భాగం.
సమాజాన్ని విభజించడం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, అధికారాన్ని కేంద్రీకరించడమే బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ ఉద్దేశం. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, అడవులపై గిరిజనుల హక్కులను కాలరాయడం, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడంలో భాగమే ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని ఏరివేయడం. హింసాత్మక చర్యలతో భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు టీఎంసీ గొడుగు
పశ్చిమబెంగాల్, త్రిపురలో సీపీఎంకు పూర్వవైభవం తెచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, ఇతర వామపక్ష పాచ్చిలు విజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్.. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీకి రాచబాట వేస్తోంది.
ఎండకు, వానకు తడవకుండా టీఎంసీ గొడుగు పడుతోంది. అన్ని రకాలుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎదిగేందుకు తోడ్పడుతోంది. ఆ విషయాన్ని బెంగాల్ ప్రజలు గుర్తిస్తున్నారు. ఈసారి సీపీఎంను ఆదరిస్తారు. త్రిపురలో తిప్రమోతా–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల గిరిజనులు అసహనంతో ఉన్నారు.


