
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా కె గ్రామస్తులు హరితహారం అమల్లో ఆదర్శంగా నిలిచారు. 2021 జూలై 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. వాటిని సంరక్షించేందుకు వినూత్న ఆలోచన చేశారు.

గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సొంతంగా ఖర్చు చేసి చీరలు కొనుగోలు చేశారు. మొక్కలకు ప్లాస్టిక్ కంచెలు వేసి వాటి చుట్టూ చీరలు కట్టారు. నాడు నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి హరిత తోరణంలా కనిపిస్తున్నాయి. గ్రామానికి వచ్చేవారికి స్వాగతం పలికేలా పచ్చని పందిరి ఇలా కనువిందు చేస్తోంది.
- సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

పచ్చని అంచున పొగమంచు..
సహ్యాద్రి పర్వతాలుగా పిలుచుకునే మహబూబ్ (నిర్మల్) ఘాట్స్ ఈ సీజన్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్–నాగపూర్ దారిలో పాత ఎన్‌హెచ్–44 దారిలో నిర్మల్ జిల్లా కేంద్రానికి 10–12 కి.మీటర్ల దూరంలో ఈ సహ్యాద్రి పర్వతాలు స్వాగతం పలుకుతాయి. ఒంపులు, ఘాట్ రోడ్డు చుట్టూ పచ్చని, ఎత్తయిన చెట్లతో వానాకాలంలో ఇక్కడి వాతావరణం ఆకట్టుకుంటుంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్

బొగత జలపాతం వద్ద సందడి
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం (Bogatha Waterfall) వద్ద బుధవారం పర్యాటకులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.
కాగా, ఇటీవల వర్షాలు విస్తారంగా కురువడంతో జలపాతం ఉధృతంగా ప్రవహించింది. దీంతో అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రవాహం తగ్గడంతో పర్యాటకులను నిబంధనల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో జలపాతానికి పర్యాటకులు తరలొచ్చారు. పర్యాటకుల ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు.

మమతానురాగాల రాఖీ
అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. ఈ పర్వదినం సమీపిస్తున్న తరుణంలో మార్కెట్‌లో విభిన్న రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటినుంచే కొనుగోలుదారులతో దుకాణాలు సందడిగా మారాయి. హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి.
చదవండి: విశాఖ టు జోగిపేట వయా వికారాబాద్!