
చౌటుప్పల్ రూరల్: దసరా మామూళ్లు ఇవ్వలేం.. అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమ యాజమాన్యం బోర్డు పెట్టింది. దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల కోసం గ్రామాల్లోని యువత చందాలు వసూలు చేస్తుంటారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బంది కూడా పరిశ్రమ వద్దకు వెళ్లి దసరా (dussehra) మామూళ్లు అడుగుతారు. అయితే, ఈ ఏడాది పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని, తాము ఎవరికీ దసరా చందాలు ఇవ్వలేమని పరిశ్రమ గేటుకు బోర్డు తగిలించారు.
వైద్యానికి పడవ ప్రయాణమే..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మల్యాల సమీపంలోని గొత్తికోయగూడెంలో (gutti koya gudem) శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. కొండాయి– దొడ్ల మధ్యలో వంతెన లేకపోవడం.. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవలో ప్రయాణించాల్సి వచ్చింది. దొడ్లనుంచి నుంచి గొత్తి కోయగూడానికి రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు.

గొత్తికోయగూడెంలో వైద్య శిబిరం నిర్వహించి, ఇంటింటికి తిరిగి జ్వరాల సర్వే (Fever Survey) చేశారు. మొత్తం 35 మందికి మందికి మందులు అందజేసి.. ఐదుగురికి రక్తపూతల పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కొండాయి వైద్యాధికారి డాక్టర్ ప్రణీత్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్‌రావు, ఆశ వర్కర్లు జ్యోతి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

విద్యార్థులతో బెంచీల తరలింపు
ట్రాక్టర్‌లో ప్రమాదకర ప్రయాణం
జగిత్యాల రూరల్: విద్యార్థులతో ట్రాక్టర్‌లో ప్రమాదకర రీతిలో బెంచీలు తరలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట పాఠశాలలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. పురాణిపేట పాఠశాల విద్యార్థులకు బెంచీలు అవసరం కాగా.. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది శుక్రవారం ట్రాక్టర్‌లో జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి బెంచీలు తీసుకొచ్చేందుకు వెళ్లారు. బెంచీలను విద్యార్థులతో ట్రాక్టర్‌లోకి మోయించారు. కాగా, విద్యార్థులు అదే ట్రాక్టర్‌లో ప్రమాదకర రీతిలో.. పొరండ్ల నుంచి పురాణిపేటకు ప్రయాణించడం చూసి పట్టణ ప్రజలు విద్యాశాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెరువులో దిగి.. విద్యుత్ సమస్య పరిష్కరించి
ఆలేరు రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక నుంచి పటేల్‌గూడెం వెళ్లే మార్గంలో మల్లన్న కుంట చెరువు వద్ద వ్యవసాయ బావులకు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్‌లో సాంకేతిక సమస్య వల్ల గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్.. ప్రాణాలకు తెగించి కుంటలోకి దిగి ఈదుకుంటూ వెళ్లి స్తంభం ఎక్కి విద్యుత్ లైన్‌ను సవరించాడు. శ్రీకాంత్ సాహసాన్ని గుర్తించిన భువనగిరి డివిజినల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు అతనికి ప్రశంసా పత్రం అందజేశారు.
చదవండి: శ్రీపురం శ్రీమంతులు.. రూ. కోటితో ఆలయం పునరుద్ధరణ

ముమ్మరంగా తిరుమాడ వీధుల పనులు
వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించేందుకు చుట్టూ వెడల్పాటి మాడవీధులు, తొమ్మిది అంతస్తుల్లో నాలుగు రాజగోపురాలు నిర్మించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేయించారు. ఆలయం చుట్టూ ఉన్న స్థలం చదును పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ