రాజీమార్గంతోనే ప్రశాంత జీవనం
పరిష్కారమైన కేసుల్లో కొన్ని..
● జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగులో ఉన్న క్రిమినల్ కేసును రాజీ చేసుకున్న ఉభయ కక్షిదారులను జిల్లా ప్రధాన జడ్జి అభినందించి వారికి అవార్డు కాపీలు అందజేశారు.
● ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్‌లో ఉన్న దంపతుల విడాకుల కేసును రాజీద్వారా పరిష్కరించారు. దంపతుల మధ్య సయోధ్య కుదిరించి ఇరువురితో పూలదండలు మార్పించారు. వారికి మిఠాయిలు పంపిణీ చేసి అభినందించారు.
● భువనగిరి మండలంలోని ఓ గ్రామంలో ఒకే ఘటనలో 15 మందికిపై కేసు నమోదు కాగా, ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు.
భువనగిరిటౌన్ : క్షణికావేశంతో నేరాలకు పాల్పడి కేసుల పాలైన వారు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనం గడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి జయరాజు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. చిన్నచిన్న కారణాలతో దారితీసిన వివాదాలను పట్టింపు లేకుండా పరిష్కరించుకోవాలన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ముక్తిదా, పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్‌కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికస్థోమత లేని కక్షిదారులకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థ సహకారం అందజేస్తుందన్నారు.
2,655 కేసులు పరిష్కారం
లోక్ ఆదాలత్‌లో 2,655 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించబడ్డాయి. ఇందులో సివిల్ 11, క్రిమినల్ 2,578, పీఎల్‌సీ 44 కేసులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జ్ ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ జి.స్వాతి, భువనగిరి న్యాయవాదుల సంఘం కార్యదర్శి బొల్లేపల్లి కుమార్, పీపీ పైల లింగారెడ్డి, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ భూపాల్‌రెడ్డి, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశం, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజశేఖర్, నాగరాజు, సాయి శ్రీనివాస్, సరిత, న్యాయవాదు లు పాల్గొన్నారు
ప్రధాన న్యాయమూర్తి జయరాజు


