కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ
రాజాపేట : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కరాటే శిక్షణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణ కాలం.. మూడు నెలలు
జిల్లాలో పీఎంశ్రీ కింద 26 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 3,900 వరకు మంది ఉన్నారు. కరాటేలో శిక్షణ ఇవ్వడానికి ఆయా పాఠశాలలకు ఏడాదికి రూ.30 వేల చొప్పున చెల్లించేవారు. మూడు నెలల కాలంలో 72 తరగతులు నిర్వహించి కరాటేలో ప్రత్యేక శిక్షణ పొందిన కోచ్‌లతో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్‌లో మెళకువలు నేర్పించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో పాఠశాలకు రూ.15వేలు చెల్లించారు. మూడు నెలల కాలంలో 36 తరగతులు నిర్వహించి శిక్షణ ఇవాల్సి ఉంటుంది.
కరాటే నేర్చుకోవడంతో ధైర్యం పెరిగింది
కరాటే నేర్చుకోవడం వల్ల ధైర్యం పెరిగింది. ఎవరైనా మాపై దాడిచేస్తే ఎలా ప్రతిఘటించాలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఆత్మరక్షణకు కరాటే, సెల్ఫ్‌డిఫెన్స్ విద్యతలు ఎంతో ఉపయోగపడుతాయని భావిస్తున్నాం. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది.
– కొన్నె రిషిత, పదో తరగతి, రాజాపేట
తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరం
విద్యార్థుల చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందేలా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో బాలికలపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అకస్మాత్తుగా ఎదురయ్యూ ఘటనలను ఎదుర్కొనేందుకు కరాటే దోహదపడుతుంది.
– దార్శనం క్రాంతి, కరాటే శిక్షకుడు
పతకాలు కైవసం
కరాటేలో శిక్షణ పొందిన బాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ స్టేడియంలో కరాటేతో పాటు కుంఫూ, తైక్వాండో జాతీయస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున యాదాద్రి జిల్లా నుంచి రాజాపేట, చల్లూరు, దూదివెంకటాపురం ప్రభుత్వ ఉన్నత, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు.
● చల్లూరు పాఠశాలకు చెందిన ముగ్గురు, దూదివెంకటాపురం ఐదుగురు, రాజాపేట మాంటిసోరి పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రౌన్ పథకాలను కై వసం చేసుకున్నారు.
● హైదరాబాద్‌లోని రాణిరుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, తైక్వాండో పోటీల్లో రాజాపేట బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు
6నుంచి 10 వ తరగతి విద్యార్థినులకు శిక్షణ
ప్రత్యేకంగా కోచ్‌ల నియామకం
రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనరుస్తున్న రాజాపేట విద్యార్థినులు


