కొత్త సర్పంచ్‌లకు సవాళ్లు!
సాక్షి, యాదాద్రి : పల్లెల్లో నెలకొన్న సమస్యలు కొత్త పాలకవర్గాలకు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. దీంతో పంచాయతీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచ్‌లు వాటిని ఎలా పరిష్కరిస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. జిల్లాలో 427 పంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న పాలక వర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి.
15వ ఆర్థిక సంఘం నిధులొస్తేనే..
నూతన పాలక వర్గాల ఆశలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఉన్నాయి. పంచాయతీలకు రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత డెయినేజీలు తదితర పనులు అటకెక్కాయి. వీటిని పూర్తి చేయడంతో పాటు సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, పల్లె ప్రకృతి వనాలు, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, బోర్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతుల ఖర్చులు.. ఇప్పుడు కొత్త సర్పంచ్‌లకు భారంగా మారనున్నాయి.
రూ.120 కోట్లకు పైగా నిలిచిన గ్రాంట్స్
2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2024 జనవరితో పాలకమండళ్ల పదవీకాలం ముగిసింది. దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. రెండేళ్ల లోపు పాలకవర్గాల ఎన్నికల జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు రావు. దీంతో జనవరిలోపే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసింది. 15వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ, నాలుగు రూపాయల గ్రాంట్ వంటి నిధులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.120 కోట్లకుపైగా రెండేళ్లుగా నిధులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో 15 నెలలు, ఈ ప్రభుత్వం 20 నెలలుగా నిధులు లేవు. కేవలం ప్రజల నుంచి పన్నుల వసూలుపైనే ఆధారపడి ఇంతకాల నడిచాయి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ డ్రైవర్, స్వీపర్, వాటర్‌మన్‌లు ఉంటారు. గ్రామ జనాభాను బట్టి నలుగురు నుంచి 8 మంది వరకు సిబ్బంది ఉంటారు. సిబ్బందికి రూ.6 వేల నుంచి రూ.8.500 వరకు వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ పెండింగ్‌లోనే పడ్డాయి.
పూర్తి చేసిన పనులకు బిల్లులు పెండింగ్
పంచాయతీల్లో కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. పాత సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించి కొందరికి రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో పాటు పూర్తయిన పనులకు రూ.90 కోట్లకు చెక్‌లు సిద్ధంగా ఉన్నాయి. నిధులు నిలిచిపోవడంతో ఒక్కో కార్యదర్శికి రూ.2 లక్షల వరకు ప్రభుత్వం బాకీ పడి ఉంది. చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు పలు చోట్ల మరమ్మతులు లేక, డీజిల్‌కు డబ్బులు లేక మూలన పడ్డాయి. వీటి మరమ్మతులు ఇప్పుడు నూతన పాలకవర్గాల ముందున్న ప్రధాన బాధ్యతగా కనిపిస్తోంది.
పంచాయతీ భవనాలు రెడీ
గ్రామ పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త సర్పంచ్‌లు తమ సొంత ఖర్చుతో గ్రామ పంచాయతీ భవనాలను అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కూర్చునేలా ప్రత్యేక ఫర్నిచర్ తెప్పిస్తున్నారు.
గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారం సోమవారం జరుగుతుంది. ప్రతేక అధికారులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల చేత తొలి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా రిజిస్టర్‌లో సంతకం చేయడం ద్వారా బాధ్యతలు స్వీకరించినట్లు అవుతుంది.
– దేప విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఓ
పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రంగులు వేసి ముస్తాబు చేసిన చీకటిమామిడి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం
పంచాయతీల్లో
ఎక్కడి సమస్యలు అక్కడే
రెండేళ్లుగా నిలిచిన నిధులు
అభివృద్ధికి నోచని పల్లెలు
నేడు కొలువుదీరనున్న
నూతన పాలకవర్గాలు
ఆర్థిక సంఘం నిధులపైనే సర్పంచ్‌ల ఆశలు


