విశాఖ టు జోగిపేట వయా వికారాబాద్‌! | Why Telangana state does not detention center explainer | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్రానికి డిటెన్షన్‌ సెంటర్‌ కరువు

Jul 25 2025 5:08 PM | Updated on Jul 25 2025 5:16 PM

Why Telangana state does not detention center explainer

జోగిపేట సబ్‌ జైలు

డిపోర్టేషన్‌ చేసే వారిని ఉంచాల్సింది అక్కడే

ఉమ్మడి రాష్ట్రంలో ఇది విశాఖపట్నం జైలులో

ఆపై సీసీఎస్‌ ఆదీనంలో తాత్కాలికంగా ఏర్పాటు

వికారాబాద్‌లో నిర్మించడానికి గతంలో యత్నం

తాజాగా జోగిపేటలోని సబ్‌ జైల్‌లో ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో:  సైబర్‌ నేరాలు... డ్రగ్స్‌ దందా... అక్రమ నివాసం... అసాంఘిక కార్యకలాపాలు... అనుమానాస్పద ప్రవర్తన... ఇలాంటి అనేక కారణాలతో చిక్కిన విదేశీయుల్లో కొందరిపై కేసులు నమోదు చేస్తుంటారు. మరికొందరిని తక్షణం వారి వారి దేశాలకు బలవంతంగా తిప్పిపంపుతారు. డిపోర్టేషన్‌గా పిలిచే ఈ ప్రక్రియకు కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. అప్పటి వరకు వారిని డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో డిటెన్షన్‌ సెంటర్‌ ఉండేది. విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక సెంటర్‌ లేకపోవడంతో తాత్కాలికంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ ఆదీనంలో ఉంచారు. ఆపై వికారాబాద్, హైదరాబాద్‌లలో ఏర్పాటు చేయాలని భావించినా ఇప్పుడది జోగిపేట సబ్‌ జైలుకు మారింది.  

ఆ దేశాలకు చెందిన వారే అధికం... 
ఇక్కడ ఉన్న అవకాశాల నేపథ్యంలో నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోస్ట్‌ వంటి ఆఫ్రికా దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్‌ (Hyderabad) వస్తున్నారు. వీరిలో కొందరు తమ వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసేవారు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇదే జరిగేది. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్‌కు అవకాశం ఉండేది కాదు. దీంతో పాటు కొందరు నల్లజాతీయులు సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ విక్రయం చేస్తున్నారు. వీరు పట్టుబడినా, శిక్ష పూర్తి చేసుకున్నా, కోర్టు ఆదేశించినా డిపోర్టేషన్‌ చేయాల్సిందే. కొందరిపై నేరుగా డిపోర్టేషన్‌ ప్రక్రియ చేపడతారు.  

తాత్కాలికం అంటూ ఇప్పటి వరకు... 
ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న ఈ విదేశీయుల ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. దీనిని గుర్తించిన నగర పోలీసులు అక్రమంగా నివసిస్తున్న వారికి, అనుమానాస్పద కదలికలు కలిగిన వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్‌ చేయాలని నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి పైనే కేసు నమోదు చేసి, అరెస్టు తదితర వ్యవహారాలు చేస్తున్నారు. ఈ డిపోర్టేషన్‌ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. 

ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరికి గుర్తింపు పత్రాలు, ఢిల్లీలోని కార్యాలయాల నుంచి టెంపరరీ ట్రావెల్‌ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్‌వేస్‌ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేష‌న్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) నుంచి ఎగ్జిట్‌ పర్మిట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వారిని అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం వారిపై మూవ్‌మెంట్‌ రిస్ట్రెక్షన్‌ ఆర్డర్‌ తీసుకుని డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచుతారు. రాష్ట్ర విభజనకు ముందు ఇది విశాఖపట్నంలో ఉండేది. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన  హైదరాబాద్‌ సీసీఎస్‌ను డిపోర్టేషన్‌ సెంటర్‌గా మార్చినా ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతోంది.  

సీసీఎస్‌ మారినా సౌకర్యాల లేమి...  
ఒకప్పుడు సీసీఎస్‌ పబ్లిక్‌గార్డెన్స్‌ ఎదురుగా ఉన్న ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆనుకుని ఉండేది. అక్కడ ఐదుగురిని ఉంచడానికి సరిపోయే జైలు గదినే ఈ సెంటర్‌గా వాడారు. ఆపై సీసీఎస్‌ బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌కు వెళ్లింది. దీంతో అక్కడే ఓ గదిని  లాకప్‌ కమ్‌ డిపోర్టేషన్‌ సెంటర్‌గా వాడుతున్నారు. ఒక్కోసారి పాత సీసీఎస్‌ లాకప్‌లోనే వీరిని ఉంచుతున్నారు. ఆయా విదేశీయులకు అనువైన ఆహారం అందించలేకపోవడం కొత్త సమస్యలకు కారణం అవుతోంది. 

దీంతో నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిటెన్షన్‌ సెంటర్‌ (detention center) కోరుతూ ఐదేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో వికారాబాద్‌లో ఈ సెంటర్‌ ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. దీనికి నిధుల కేటాయింపు జరగకపోవడంతో నిర్మాణం ముందుకు సాగలేదు. 2023లో ఈ అంశంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నగరానికి దూరంగా కాకుండా సిటీలోనే డిటెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఎట్టకేలకు జోగిపేట సబ్‌ జైలులో... 
కొత్తగా డిటెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు భారీగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న భవనాల్లో అనువైనది ఎంపిక చేసి అందులోనే దీని ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జోగిపేట సబ్‌ జైల్‌ అధికారుల దృష్టికి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న విదేశీయుల వ్యవహారం సున్నితమైంది, అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉన్నదని ప్రభుత్వ అభిప్రాయం. 

చ‌ద‌వండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న e వ్య‌ర్థాలు

దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం అందించే వంట వారితో పాటు ఇతర సౌకర్యాలు ఉండేలా ఆదేశించింది. ఈ సెంటర్‌ నిర్వహణతో పాటు డిపోర్టేషన్‌ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన నిధులను అందించడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో జోగిపేట సబ్‌ జైలులో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్న అధికారులు వీలైనంత త్వరలో ఈ సెంటర్‌ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement