
ఈ వేస్ట్ మేనేజ్‌మెంట్ 18 శాతమే!
రీ సైక్లింగ్ యూనిట్ల సామర్థ్యం ఏటా 3.5 లక్షల టన్నులు..
సేకరించేది 64,635 టన్నులే..
ప్రజల్లో అవగాహనా లోపం.. రీసైక్లింగ్‌కు చేరని ఈ వ్యర్థాలు
పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఈ వేస్ట్.. రీసైక్లింగ్‌పై అధికారుల్లో కొరవడిన శ్రద్ధ.. ప్రజల్లో అవగాహన లోపం.. పర్యావరణానికి ప్రమాదం... వెరసీ విశ్వనగరానికి ఈ వేస్ట్ విపత్తు పొంచి ఉంది. ఈ వ్యర్థం ఏ అనర్థానికి దారితీస్తుందో మరి! హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ (ఈఈఈ) వినియోగంతోపాటు అదే స్థాయిలో ఈ వ్యర్థాలు కూడా గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. అయితే వీటిని సరిగా రీసైక్లింగ్ చేయడంలో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదు. కొత్త కొత్త ఫోన్లు, టీవీలు, విద్యుత్తు పరికరాలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ప్రజలు కూడా వాటి పట్ల మక్కువ చూపుతున్నారు. దీంతో పాతవి మూలకు చేరుతున్నాయి. కొత్తవి చెంతకు చేరుతున్నాయి.
వీటి రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలోని 31 సంస్థలకు కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) నుంచి అనుమతులు ఇచ్చింది. ఇందులో ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల ఈ వ్యర్థాలను రీసైకిల్ చేసే సామర్థ్యం ఉంది. అయినప్పటికి 64,635 మెట్రిక్ టన్నులే రీసైకిల్ చేస్తున్నాయి. అంటే.. 18 శాతం మేర రీసైక్లింగ్ చేస్తున్నారన్నమాట. రాష్ట్రంలో ఈ వ్యర్థాల రీసైక్లింగ్ సామర్థ్యం, సేకరణకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అవగాహనా లోపం కారణంగా ప్రజలు వేలాది మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు చెరువులు, కాల్వలు, సాధారణ చెత్తలో కలిపేస్తున్నారు. రీసైక్లింగ్ యూనిట్లను ఖచ్చితమైన ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు.
బంగారం, రాగి, ఇతర లోహాలు..
కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023–24లో ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ పోర్టల్‌లో 64,635 మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను సేకరించారు. ప్రాసెస్ చేసిన ఈ వ్యర్థాల్లో బంగారం, రాగి, అల్యూమినియం, ఇనుము (Iron) వంటి లోహాలు 24,497 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇతర వ్యర్థాలు 24,433 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి.
మనమే టాప్..
హైదరాబాద్‌లో ఐటీ, వైద్యం, బల్క్ డ్రగ్స్, నిర్మాణ రంగాలు, ప్రభుత్వ, ప్రైవేటు పరిపాలనా కార్యాలయాలు, ప్రపంచ స్థాయి ఉత్తమ కంపెనీ(ఎంఎన్‌సీ)ల శాఖలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఎక్విప్‌మెంట్ (ఈఈఈ) వినియోగంతోపాటు ఈ వ్యర్థాలు అధికంగానే ఉంటున్నాయి. అయితే వీటిని రీసైక్లింగ్ చేయడంలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ వ్యర్థాల నిర్వహణ మెరుగ్గానే ఉందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
తెలంగాణలో ఏటా సరాసరిన 42 వేల మెట్రిక్ టన్నులు ప్రాసెసింగ్ చేస్తుండగా మహారాష్ట్ర 18 వేల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో నిలుస్తోంది. రీసైక్లింగ్ ప్రక్రియ ఇప్పటికీ చాలావరకు అనధికారికంగా నడుస్తోందని, సరైన పద్ధతులపై అవగాహన లోపం లోపించిందని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. పాడైన ఎలక్ట్రిక్, ఎల్రక్టానిక్ పరికరాల సేకరణ కేంద్రాలకు అప్పగించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన లేదని, ఈఈఈ సేకరణ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియక సాధారణ చెత్తలో కలిపి పారేస్తున్నారని అధికారులు గుర్తించారు.