ఎల్రక్టానిక్‌ వేస్ట్‌ బంగారమే! త్వరలో హైదరాబాద్‌ శివార్లలో రీసైక్లింగ్‌ ప్లాంట్‌

A recycling plant on the outskirts of Hyderabad soon - Sakshi

అమెరికా సంస్థ రెల్డాన్‌ రిఫైనింగ్‌తో కలసి ఏర్పాటు చేస్తున్న ‘రీసస్టెయినబిలిటీ’ కంపెనీ

రూ. 65 కోట్ల అంచనా వ్యయంతో పనులు 

మే నెలలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు 

‘ఈ–వేస్ట్‌’సమస్యకు పరిష్కారం.. విలువైన లోహాల రీసైక్లింగ్‌ 

దీనితో పర్యావరణానికీ మేలు అంటున్న నిపుణులు 

మన చేతిలోని సెల్‌ఫోన్‌.. చూసే టీవీ.. కంప్యూటర్‌.. కీబోర్డు.. ఇలా ఎన్నో ఎల్రక్టానిక్‌ వస్తువులు. పాడైపోతేనో, పాతబడిపోతేనో పడేస్తూ ఉంటాం. ఇలాంటి ఎల్రక్టానిక్‌ చెత్త (ఈ–వేస్ట్‌) నుంచి బంగారం, వెండి, లిథియం వంటి ఎన్నో విలువైన లోహాలను వెలికి తీయవచ్చు తెలుసా? ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోని మదర్‌బోర్డులు, ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లు, పలు ఇతర భాగాల్లో స్వల్ప స్థాయిలో విలువైన లోహాలను వినియోగిస్తారు. బోర్డులు, చిప్‌లు మన్నికగా పనిచేయడంతోపాటు వాటిలో వేగంగా/సమర్థవంతంగా విద్యుత్‌ ప్రసారానికి ఇవి తోడ్పడతాయి. మరి ఎల్రక్టానిక్‌ పరికరాలను పడేసినప్పుడు.. వాటి నుంచి సదరు లోహాలను వెలికితీసే ‘ఈ–వేస్ట్‌ రీసైక్లింగ్‌’ప్లాంట్‌ త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతోంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఎల్రక్టానిక్‌ వ్యర్థాలను (ఈ–­వేస్ట్‌) రీసైకిల్‌ చేసి విలువైన లోహాలను వెలికితీసే ప్లాంట్‌ హైదరాబాద్‌ శివార్లలోని దుండిగల్‌లో ఏర్పా­టుకానుంది. వివిధ రకాల వ్యర్థాలను శాస్త్రీయం­గా రీసైక్లింగ్, రీయూజ్‌ చేయడంలో గుర్తింపు పొందిన రాంకీ కంపెనీకి చెందిన ‘రీసస్టెయినబి­లిటీ లిమిటెడ్‌’సంస్థ.. అమెరికాకు చెందిన రెల్డాన్‌ రిఫైనింగ్‌ సంస్థతో కలిసి ఈ–వేస్ట్‌ రిఫైనరీ ప్లాంట్‌ పనులు చేపట్టింది.

పాడైపోయిన కంప్యూటర్లు, మొ­బైల్‌ఫోన్స్, ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలను హైదరాబాద్‌తోపాటు బెంగళూర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, హల్ది­యా, వైజాగ్‌ తదితర కేంద్రాల్లో ధ్వంసం చేసి వాటిల్లోని విలువైన మెటల్స్‌ ఉండే భాగాలను వేరు చేస్తారు. వాటిని హైదరాబాద్‌ ప్లాంట్‌లో రీసైక్లింగ్‌ చేస్తారు. 

మే నాటికి అందుబాటులోకి.. 
ఈ ప్లాంట్‌లో అధునాతన ‘పైరో మెటలర్జికల్‌ టెక్నాలజీ’ద్వారా ఈ–వేస్ట్‌తోపాటు పారిశ్రామిక వ్యర్థాలు కలిపి ఏటా దాదాపు 20 వేల మెట్రిక్‌ టన్నుల వరకు రీసైకిల్‌ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రీసైక్లింగ్‌ ద్వారా విలువైన బంగారం, వెండి, కోబాల్ట్, లిథియం, నికెల్, పల్లాడియం, ప్లాటినం వంటివి వేరుచేస్తారు.

ఈ లోహాలను తిరిగి ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్‌ రంగాలతోపాటు స్టీల్, ఫర్నిచర్, భారీ మెషినరీ పరిశ్రమల్లో వినియోగిస్తారు. దాదాపు రూ.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్‌ను వచ్చే మే నెలలో ప్రారంభించే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఫార్మాస్యూటికల్, పెట్రో కెమికల్, జ్యువెలరీ వ్యర్థాలను సైతం రీసైక్లింగ్‌ చేసే యోచనలో ఉన్నట్టు ‘రీసస్టెయినబిలిటీ’ప్రతినిధులు చెప్తున్నారు. 

ఉత్పత్తి మేరకు రీసైక్లింగ్‌ లేదు 
ప్రపంచంలో ఈ–వేస్ట్‌ ఎక్కువగా ఉత్పత్తవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఈ–వేస్ట్‌లో నాలుగో వంతు కంటే తక్కువే రీసైకిల్‌ చేయగల పరిస్థితులు ఉన్నాయి. దేశంలో 2019లో వెలువడిన ఈ–వేస్ట్‌ 3.2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కాగా.. 2030 నాటికి ఇది మరో 21 శాతం పెరుగుతుందని అంచనా. 

90శాతం రీసైక్లింగ్‌ అశాస్త్రీయంగానే.. 
దేశంలోని ఈ–వేస్ట్‌లో దాదాపు 90 శాతం రీసైక్లింగ్‌ అనధికారికంగా, అశాస్త్రీయంగా జరుగుతోంది. నీతి ఆయోగ్‌ గణాంకాల మేరకు దేశవ్యాప్తంగా మూడు వేలకుపైగా కేంద్రాల్లో ఈ పనులు జరుగుతున్నాయి . వాటిలో పనిచేసే కారి్మకులు మాన్యువల్‌గానే వ్యర్థాల్ని వేరు చేస్తుండటంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. వాటి పరిసరాల్లోని ప్రజలు తీవ్ర వ్యాధులబారిన పడే ప్రమాదం పొం­­చి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సాంకేతికతతో పరిష్కారం 
అధిక మొత్తాల్లో ఈ–వేస్ట్‌ను రీసైక్లింగ్‌ చేయ గల ఆధు­నిక సాంకేతిక పరిజ్ఞానం చైనా, ఫ్రాన్స్, అమె­రికా వంటి దేశాల్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం హైద­రాబాద్‌ శివార్లలోని దుండిగల్‌లో 13.6 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న ఈ–వేస్ట్‌ రిఫైనరీ ప్లాంట్‌ కూడా ఆధునికమైనదే.

దీనితో ఈ–వేస్ట్‌ సెక్టార్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించనుందని.. సర్క్యులర్‌ ఎకానమీ బలోపేతమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌–2022 సవ్యంగా అమలు కావాలన్నా ఇలాంటి ప్లాంట్లు అవసరమని అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top