
రోజుకు 60.3 కోట్ల లీటర్ల కలుషిత జలాల విడుదల
11,522 టన్నుల ఘన, 1,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం..
ఏటా 74,339 టన్నుల ఈ– వేస్ట్ పారబోత
కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్‌తోపాటు ఘన, బయో, నిర్మాణ, ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగవుతున్నాయి. జీవరాశులకు ప్రాణాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నాయి. మానవాళితోపాటు సకల జీవరాశుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో ఏటేటా పరిశ్రమల నుంచి వ్యర్థాల విడుదల గణనీయంగా ఉందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అయితే వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ, శుద్ధి చేయాల్సిన పీసీబీకి ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం గమనార్హం. 2014–15 సంవత్సరం నుంచి ప్రభుత్వం పీసీబీకి నిధులు, గ్రాంట్లను కేటాయించడం లేదు. కేవలం ఆపరేషన్, రెన్యూవల్ కన్సెంట్ రూపంలో ఆసుపత్రులు, పరిశ్రమలు చెల్లించే ఫీజులే పీసీబీకి ఆదాయం వనరులుగా మారాయి.
పరిశ్రమల నుంచి కలుషిత జలాలు..
రాష్ట్రంలో పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో రెడ్ కేటగిరీ అత్యంత హానికారక పరిశ్రమల కిందికి వస్తుంది. రాష్ట్రంలో 3,838 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 4,330 ఆరెంజ్, 1,332 గ్రీన్, 2,692 వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 2,193 పరిశ్రమలు రోజుకు 60.3 కోట్ల లీటర్ల కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయి. ఈ వ్యర్థాలు నీరు చెరువులు, కాలువలు, పంట పొలాలు, భూగర్భంలోకి ఇంకుతున్నాయి.
3,024 పరిశ్రమలు ఏటా 3.17 లక్షల టన్నుల ప్రమాదక వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో 94,131 టన్నులు పునర్వినియోగించదగిన వ్యర్థాలు కాగా.. 2,085 టన్నులు దహనం చేయగల వ్యర్థాలు, 1,10,930 టన్నులు కో–ప్రాసెసింగ్, 1,09,943 టన్నులు భూమిలో నింపే వ్యర్థాలు.
ఘన వ్యర్థాలూ ఘనమే..
రోజుకు 11,522 టన్నుల ఘన వ్యర్థాలు (Solid Waste) విడుదలవుతున్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 7,206 టన్నులు కాగా.. 4,316 టన్నులు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి విడుదల అవుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి శుద్ధి చేయని బయో మెడికల్ వ్యర్థాలు విడుదల కావడం లేదు. ఇతర వ్యర్థాల మిశ్రమంతో బయో వేస్ట్ విడుదల అవుతున్నాయి. 10,292 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి రోజుకు 26,316 కిలోల బయో మెడికల్ వేస్ట్ విడుదల అవుతోంది. ఇందులో 17,184 కిలోలు దహించలేని బయో మెడికల్ వేస్ట్ కాగా.. 9,132 కిలోలు ఆటో క్లేవ్ వ్యర్థాలు.
ఈ–వేస్ట్..
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యర్థాలు కూడా గణనీయంగా పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఏటా 74,339 టన్నుల ఈ–వేస్ట్ విడుదలవుతోంది. 31 ఈ–వేస్ట్ (e- waste) కేంద్రాల్లో ఏటా 1,83,668 టన్నుల ఈ–వేస్ట్ శుద్ధి అవుతోంది. రాష్ట్రంలో రోజుకు 2,255 టన్నుల నిర్మాణ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,763 టన్నులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో 492 టన్నుల వ్యర్థాలు ఉన్నాయి.
చదవండి: డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు
జీడిమెట్ల, ఫతుల్‌గూడ, శామీర్‌పేట, శంషాబాద్‌లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఏటా వీటి సామర్థ్యం 2 వేల టన్నులు. రాష్ట్రంలో 251 ప్లాస్టిక్ తయారీ కేంద్రాలు నమోదయ్యాయి. వీటి నుంచి రోజుకు 1,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల అవుతుండగా.. 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ అవుతోంది.