
టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఊహాచిత్రం
నాలుగేళ్లు అయినా అతీగతీలేని కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణం
కనీసం భూమిపూజకూ నోచుకోని వైనం
అంతర్జాతీయ సమీకృత మార్కెట్‌పై చిత్తశుద్ధి కరువు
2021 అక్టోబర్ నుంచి బాటసింగారంలో తాత్కాలిక మార్కెట్
సాక్షి, హైదరాబాద్: రైతుల, వ్యాపారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా, పండ్ల మార్కెట్ ఏర్పాటు అతీగతీలేదు. నాయకులు హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇంకా ప్రభుత్వ ఆమోదముద్రకు నోచుకోలేదు. ఇదీ కోహెడలో పండ్ల మార్కెట్ దుస్థితి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని కోహెడ్‌లో పండ్ల మార్కెట్ నిర్మిస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి కంప్యూటర్ గ్రాఫిక్ చిత్రాల్లో మెరుస్తోందే తప్ప ఆచరణలో రూపుదిద్దుకోవడంలేదు. కనీసం భూమిపూజకు కూడా నోచుకోలేదు. డీపీఆర్‌లో మార్పుల కారణంగా ఈ వ్యవహారం గజిబిజిగా మారింది. తొలుత ఫ్రూట్ మార్కెట్ అని, ఆనక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పూలు, పండ్లు, కూరగాయల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని అధికారులు చెబుతూ వచ్చారు. తాజాగా గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌గా పేరు మార్చారు.
రూ.399 కోట్ల నుంచి రూ.2,900 కోట్లకు..
గడ్డిఅన్నారం (Gaddi Annaram) పండ్ల మార్కెట్‌ను కొత్తపేట నుంచి కోహెడకు తరలించే ప్రతిపాదనల్లో నిర్మాణ విస్తీర్ణం, అంచనా వ్యయం ఏటేటా పెరుగుతున్నాయి. తొలుత రూ.399 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా ఈ మొత్తం రూ.2,,900 కోట్లకు చేరింది. తొలి దశలో (2021) ప్రతిపాదనలు సిద్ధం చేసినపుడు 178 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం సుమారుగా రూ.399 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్‌లో అనేక దఫాలు మార్పులు చేస్తూ భూసేకరణ 199 ఎకరాలకు చేరింది. నిర్మాణ వ్యయం అంచనా సుమారు రూ.2,900 కోట్లకు పెరిగింది.
కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌ను ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ)కి 167 ఎకరాలు రూ.2,044 కోట్లు, మరో 31 ఎకరాల్లో రూ.856 కోట్లతో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈపీసీలో వేలం హాళ్లు, షెడ్లు, విదేశీ ఫ్లాగ్‌షిప్ పెవిలియన్, రిటైల్ జోన్లు, మినీ డేటా సెంటర్లు, కార్మిక విశ్రాంతి గదులు, పార్కింగ్, అంతర్గత రహదారులు, టవర్ ఆఫ్ ఎక్సలెన్స్, శీతల గిడ్డంగులు, ప్రొసెసింగ్ సెంటర్లు, వంటివి నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 2047 నాటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది. దీనికి అధికారికంగా ప్రభుత్వ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అనంతరం టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయడానికి మరికొన్నేళ్లు వేచిచూడాల్సి ఉంటుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఏడాదికి సుమారు రూ.5 వేల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ప్రత్యేక ఆకర్షణగా టవర్ ఆఫ్ ఎక్సలెన్స్..
కోహెడ మార్కెట్‌లో టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంద అడుగుల ఎత్తులో, సుమారు 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. హై స్పీడ్ ప్యాసింజర్ లిఫ్ట్‌లు, హెలీప్యాడ్‌లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు అంతస్తులు జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారని పేర్కొంటున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మౌలిక వసతులు అంతంతగానే ఉన్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరితగతిన కోహెడ మార్కెట్ (Koheda Market) నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.