
హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొనాలంటే తక్కువలో తక్కువ అరకోటి పెట్టాల్సిందే. ఇక ప్రైమ్ ఏరియాల్లో అయితే కోట్లాది రూపాయలు కుమ్మరించాల్సిందే. అయితే రూ.25 లక్షలకే 2 బీహెచ్‌కే అందుబాటులో ఉందంటే నమ్ముతారా.. అది కూడా వుడ్‌వర్క్‌తో! ఇదేతో ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కాదు. ప్రభుత్వమే స్వయంగా నిర్మించిన వెంచర్‌లోని ఫ్లాట్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్.. పోచారం, బండ్లగూలో నిర్మించిన ఫ్లాట్లు మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నామని తెలిపారు.
విశాలమైన రోడ్లు, వెంటిలేషన్..
ప్రభుత్వం నిర్మించిన సద్భావన టౌన్‌షిప్ నివాసానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ కార్యదర్శి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం పోచారంలోని సద్భావన టౌన్‌షిప్‌ను ఆయన సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. టౌన్‌షిప్‌ను 30 ఎకరాల విస్తీర్ణంలో 60 శాతం ఖాళీ ప్రదేశాలు, విశాలమైన రోడ్లు, అన్ని వైపుల నుంచి వెంటిలేషన్, అవసరానికి మించిన సెట్‌బ్యాక్‌లతో అపార్ట్‌మెంట్లను నిర్మించామన్నారు.
ఉడ్‌వర్క్‌తో రూ.13 లక్షలకే 1 బీహెచ్‌కే, రూ.25 లక్షలకే 2 బీహెచ్‌కే (2 BHK) అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిర్మించిన అపార్టుమెంట్లలోని ఫ్లాట్లలో కేవలం 10 శాతమే కామన్ ఏరియా ఉంటుందన్నారు.
516 ఎస్‌ఎఫ్‌టీతో 1 బీహెచ్‌కే 255 ఫ్లాట్లు, 900 నుంచి 1000 ఎస్‌ఎఫ్‌టీ వరకు 2బీహెచ్‌కే ఫ్లాట్లు 350 అమ్మకానికి ఉన్నాయన్నారు. కొనుగోలుదారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నాయన్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సి. భాస్కర్‌రెడ్డి, ఈఈ నరేందర్‌రెడ్డి, డీఈ వెంకట్‌రెడ్డి, ఏఈ అప్పలరాజు పాల్గొన్నారు.