 
													సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందని.. హస్తం పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ బీ టీమ్ అంటూ మాపై నిందలు వేసి.. కాంగ్రెస్ నేతలు మాత్రం దోస్తీ చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది అని చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి షేక్‌పేట డివిజన్ పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘2014 నుంచి పదేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశాం. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్‌మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయి. గంగా-జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదు. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్టులు అందించాం. కేసీఆర్ హిందు. ఆయన ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతి మతాన్ని గౌరవించారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారు. ఆయన సెక్యులర్ లీడర్ అనే దానికి ఇది ఒక నిదర్శనం.
కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆలోచించాలి. ఏం చేశారని వారికి ఓటేయాలి?. ప్రజలు ఆదరించే వ్యక్తిని కొన్ని పార్టీలు ఏదో ఒక సాకుతో ఆదరణ లేకుండా చేస్తాయి. బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాదులో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు?. కేంద్రంలో సీబీఐపీ బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది.
వక్ఫ్ బిల్లును మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కోసం జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి సంవత్సరం అయినా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు.. కానీ అలా చేయడం లేదు.
తెలంగాణలో అన్ని అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. మేము కుల రాజకీయం, మత రాజకీయం చేయం. మేం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఐటీలో ఉద్యోగాలు మూడు రేట్లు పెరిగాయి. మైనారిటీ విద్యార్థుల కోసం 204 విద్యాలయాలు ఏర్పాటు చేశాం. మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల ద్వారా మైనారిటీ విద్యార్థులకు చేయూతనిచ్చాం. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టించాం. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లో మేము బ్రహ్మాండంగా గెలిచాం. మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ప్రస్తుతం అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.
బీఆర్‌ఎస్ పాలనా కాలంలో కరోనా సమయంలో కూడా అభివృద్ధి ఆగలేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో రోడ్లు నిర్మించాం. విద్యావంతులు ఓటు వేయడానికి నిరాసక్త చూపిస్తారు. మీరు కూడా ఓటు వెయ్యాలి. రాజకీయాలపై విద్యావంతులు ఆసక్తిగా ఉండరని అందుకే ఓటు వేయరని నాకు తెలుస్తుంది. కానీ అలా చేయడం సరికాదు. మీరు ఓటు వేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు మీ భవిష్యత్తును నిర్ధారిస్తారు. కాబట్టి మంచి నాయకులను మీరు ఎన్నుకోవాలి. ఓటు అడిగే వారిని ఓటు ఎందుకు వేయాలి మీరు ఎదురు ప్రశ్నించాలి అని’ కామెంట్స్ చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
