బండారు మురళీమోహన్‌రావు
అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతరుల నుంచి సహాయం పొందేది కాని, ఎన్నడూ ఇతరులకు సాయం చేసేది కాదు. ఏ జంతువో, పక్షో వచ్చి వాగుకో వంకకో దారి అడిగితే, తెలిసినా చెప్పేది కాదు. చెప్పినా దూరం దారి చెప్పి సంబరపడేది.అడవిని పాలించే పులిరాజుకు లేక లేక బిడ్డ పుట్టింది. బాతుల వాగు దగ్గర వేడుక చేస్తున్నట్లు ప్రకటించాడు.వేడుకకు అడవిలోని జంతువులన్నీ వచ్చి విందు ఆరగించవలసిందిగా కోరాడు పులిరాజు.
వేడుకకు నక్క బయలుదేరింది. కాని, దానికి బాతుల వాగుకు దారి తెలీదు. అది అలా నడుచుకుంటూ పోతూ ఉండగా, దారిలో మామిడి చెట్టు మీద ఒక కోతి కునుకు తీస్తూ కనిపించింది. చెట్టు నీడలో ఆయాసం తీర్చుకొని, ‘కోతి బావా! కోతి బావా! బాతుల వాగుకు దారి చెబుతావా!’ అడిగింది నక్క.‘నేరుగా వెళ్లి కుడివైపు తిరుగు, చింతచెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎడమకు తిరిగి నడిస్తే, మర్రిచెట్టు కనిపిస్తుంది. అక్కడి నుంచి కుడికి తిరిగి నడిస్తే, రావిచెట్టు కనిపిస్తుంది. దానికి ఎదురుగా తాటితోపు కనిపిస్తుంది. తాటితోపు దాటగానే బాతుల వాగు ఉంటుంది’ చెప్పింది కోతి.
నక్కకు కోతి చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు. అది ఆ దారిలో ఎప్పుడూ వెళ్లనే లేదు. దాంతో బుర్ర గోక్కుంటూ ఆలోచించసాగింది. కోతి కుంటుతూ నెమ్మదిగా చెట్టు దిగి, ‘నక్క బావా! నా కాలికి ముల్లు గుచ్చుకొని గాయమైంది. నీ మీద నన్ను ఎక్కించుకుంటే, నేను నీ వెంట వేడుకకు వస్తాను!’ అంది.కోతిని పైనుంచి కిందికి చూసింది నక్క. ‘వేడుకకు రాకుంటే, విందు చేయకుండా పస్తులుండు! నిన్ను మాత్రం నా వీపు మీద ఎక్కించుకొని తీసుకుపోను. నేను నీ బానిసను కాను!’ పెద్దగా అంది నక్క .
కోతి మౌనంగా ఉండిపోయింది. నక్క అక్కడి నుంచి వేగంగా ముందుకు పోయింది.కొద్దిసేపటికి ఆ దారి వెంట ఏనుగు వచ్చింది. కుంటుతున్న కోతిని చూసింది ఏనుగు.‘కోతి బావా! నీ కాలికి ఏమైంది?’ అడిగింది ఏనుగు.‘ముల్లు గుచ్చుకొని గాయమైంది. నడవలేక పోతున్నాను!’ అంది కోతి. ‘అయ్యో! అలాగా! నీకు బాతుల వాగుకు దారి తెలుసా?’ అడిగింది ఏనుగు. తెలుసన్నట్లుగా తల ఊపింది కోతి.‘అయితే, నువ్వు నా వీపు మీద కూర్చుని వాగుకి దారి చెప్పు. ఇద్దరం కలిసి వేడుకకు పోదాం!’ అంది ఏనుగు. కోతి ఏనుగు వీపు మీద కూర్చుంది. కోతి దారి చెబుతూ ఉంటే, ఏనుగు ముందుకు పోతూ ఉంది.

అవి రెండూ కబుర్లు చెప్పుకుంటూ బాతుల వాగుకు పోతూ ఉండగా, దారిలో దూరం నుంచే మర్రి చెట్టు కింద కూర్చున్న నక్కను చూసింది కోతి.నక్క దారి మరచి, ‘ఎటు వైపు వెళ్లాలా’ అని ఆలోచించసాగింది.ఏనుగు వీపు మీద కూర్చుని వస్తున్న కోతిని గమనించి నక్క సిగ్గుతో కోతికి కనిపించకుండా పొదల్లో నక్కింది. వెనుక నుంచి ఏనుగును అనుసరించి వేడుకకు చేరాలనుకుంది. అవి మర్రిచెట్టు వరకు రాగానే, ‘నక్క బావా! అలా నక్కి కూర్చుంటే వేడుకకు ఎలా చేరుతావు! మా వెంట పద! పోదాం!’ అంది కోతి. నక్క వాటి వెంట వేడుకకు చేరింది.
విందులో రకరకాల వంటలు ఘుమ ఘుమలాడుతూ నోరూరించాయి.ఏనుగు తనకు నచ్చిన చెరుకు గడలు, అరటి గెలలు కడుపునిండా తిన్నది.నక్క లొట్టలేసుకుంటూ మాంసాహారం మెక్కి తిన్నది.కోతి మట్టుకు పులిరాజు పక్కన కింద కూర్చున్నది. కోతి ఏమాత్రం ఆహారం ముట్టుకోలేదు .
ఏనుగు, నక్క కోతిని గమనిస్తూనే ఉన్నాయి. అవి కోతిని విందు ఎందుకు చేయలేదని అడిగాయి.‘నేను మీ కన్నా ముందే వేడుకకు వచ్చి, విందు ఆరగించాను. తిరిగి ఇంటికి వెళుతుంటే కాలికి ముల్లు గుచ్చుకొని గాయమైంది!’ చెప్పింది కోతి. తమకు బాతుల వాగుకు దారి చూపించటానికే వేడుకకు మళ్లీ వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాయి ఏనుగు, నక్క.కోతి మంచితనానికి ఏనుగు పొంగిపోగా, నక్క సిగ్గుతో తలవంచుకుంది. అవి తిరిగి వెళ్లేటప్పుడు, నక్కే తన వీపు మీద కోతిని కూర్చోపెట్టుకుని ఇంటి దగ్గర దింపింది. ఆనాటి నుంచి ఇతరులకు సాయం చేస్తూ ఆనందంగా ఉండసాగింది నక్క.


