టైటిల్‌ వివాదాలు ‘సివిల్‌’లోనే తేల్చుకోవాలి | High Court says it cannot interfere in land dispute | Sakshi
Sakshi News home page

టైటిల్‌ వివాదాలు ‘సివిల్‌’లోనే తేల్చుకోవాలి

Jun 25 2025 4:14 AM | Updated on Jun 25 2025 4:14 AM

High Court says it cannot interfere in land dispute

భూ వివాదంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు 

హక్కులు, స్వా«దీన అంశాలకు అక్కడే పరిష్కారం 

దశాబ్దాల ఆస్తి వివాదంపై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో దశాబ్దాల నుంచి ఉన్న ఆస్తి వివాదానికి సంబంధించిన రిట్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 226 కింద జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తీవ్రమైన టైటిల్‌ వివాదాల పరిష్కారం కోసం ఆయా వ్యక్తులు సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని ఆదేశిస్తూ పలు పిటిషన్లను కొట్టివేసింది. అసలైన రికార్డులు లేకపోవడం, పత్రాల ప్రామాణికతకు సంబంధించి విరుద్ధమైన వాదనలు ఉన్నప్పుడు.. అలాంటి వివాదాలను పరిష్కరించడానికి సివిల్‌ దావానే సరైన మార్గమంటూ జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. 

షేక్‌పేట్‌ గ్రామం (ప్రస్తుతం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4) సర్వే నంబర్‌ 396 (సవరించిన సర్వే నం. 225)లోని ఏడెకరాలకు సంబంధించి దశాబ్దా లుగా వివాదాలున్నాయి. ఈ భూమి తొలుత హైదరాబాద్‌ మాజీ ప్రధాన మంత్రి (దివాన్‌) మహారాజా సర్‌ కిషన్‌ పెర్షాద్‌ యాజమాన్యంలో ఉంది. తర్వాత ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో జూబ్లీహిల్స్‌ గైరా జిరాయట్టి పట్టాగా నమోదై ఉంది. కాగా, మహారాజా కిషన్‌ పెర్షాద్‌ చట్టబద్ధమైన వారసులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

ప్రస్తుత యజమానుల పూర్వీకులకు అనుకూలంగా అమలు చేసిన అమ్మకపు పత్రాలు చెల్లవని పేర్కొన్నారు. అర్బన్‌ ల్యాండ్‌ (సీలింగ్, నియంత్రణ) చట్టం–1976 కింద పొందిన అనుమతులు మోసపూరితమన్నారు. ప్రస్తుత యజమానులు ప్రెస్టీజ్‌ గ్రూప్‌నకు అనుకూలంగా అమలు చేసిన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్, జీపీఏని రద్దు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు. 

ఈ తీర్పు ప్రభావం ఉండదు.. 
ప్రతివాదులైన.. ప్రైవేట్‌ కొనుగోలుదారులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ (ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌) యూఎల్‌సీ అనుమతుల తర్వాత నాటి హక్కుదారు అసదుల్లా ఖాన్‌ వారసుల నుంచి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశామని వాదించారు. ‘1937 నాటి రిజిస్టర్డ్‌ పత్రాల ద్వారా అసలు యజమానుల నుంచి టైటిల్‌ను తెలుసుకున్నాం. యూఎల్‌సీ నుంచి ఆమోదం పొందిన తర్వాత వారు 1980లో భూమిని విక్రయించారు’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. యూఎల్‌సీ రికార్డులు అందుబాటులో లేవని, వివాదాస్పద ఫొటో కాపీలు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రభుత్వం అంగీకరిస్తోందన్నారు.

మోసం ఆరోపణలకు సివిల్‌ విచారణ అవసరమని.. టైటిల్‌ వివాదాలు, వారసత్వ సమస్యలను సివిల్‌ కోర్టే నిర్ణయించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డులు మాత్రమే యాజమాన్యాన్ని ఇవ్వవని తేల్చిచెప్పారు. రిట్‌ పిటిషన్లను కొట్టివేస్తూ.. పరిష్కారం కోసం సివిల్‌ కోర్టును సంప్రదించవచ్చంటూ స్వేచ్ఛనిచ్చారు. సివిల్‌ కోర్టు విచారణపై ఈ తీర్పు ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement