కోర్టుకే తప్పుడు వివరాలిస్తారా? | High Court orders government on Kalyanalakshmi, Shaadi Mubarak | Sakshi
Sakshi News home page

కోర్టుకే తప్పుడు వివరాలిస్తారా?

Aug 21 2026 4:16 AM | Updated on Aug 21 2026 4:16 AM

High Court orders government on Kalyanalakshmi, Shaadi Mubarak

ఆర్టికల్‌ 162ను తప్పుగా పేర్కొనడంపై వివరణివ్వండి 

ఉద్యోగులు, భూములిచ్చిన రైతులను పట్టించుకోరా? 

చెల్లింపులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాధాన్యత ఏమిటి? 

జీతాలు అందని తాత్కాలిక ఉద్యోగుల అవస్థలు పట్టవా? 

కోర్టు సిబ్బందికీ కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదు 

‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌’పై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఆమోదం లేకుండానే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వ అఫిడవిట్‌లో ఆర్టికల్‌ 162ను తప్పుగా ఉటంకించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సాధారణ తప్పిదంగా తీసుకోలేమని.. రాజ్యాంగంలోని ఒక అధికరణాన్ని అధికారిక అఫిడవిట్‌లో వక్రీకరించడం ఎలా జరిగిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంక్షేమ పథకాల అమల్లో జోక్యం చేసుకోవట్లేదని.. అదే సమయంలో చెల్లింపుల ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంటూ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం గత వారం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో ఈ రెండు పథకాల చెల్లింపులపై స్టే ఇచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం గురువారం ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులు, రిటైరైన ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు కూడా మనుషులేనని.. వారికి బకాయిలు చెల్లించకపోవడం ఏమిటని ధర్మాసనం నిలదీసింది. తాత్కాలిక ఉద్యోగులు కూడా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించరా అని ప్రశ్నించింది. కోర్టు సిబ్బందికి కూడా కొన్ని నెలలుగా జీతాలు అందని పరిస్థితి ఉందని చెప్పింది.  

అప్పుల వివరాలు సమర్పించండి... 
ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ భూసేకరణ పరిహారానికి సంబంధించి 19 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా మూడింటిలో టోకెన్లు జారీ అయ్యాయన్నారు. త్వరలో మిగతా కేసుల్లోనూ విడుదల చేస్తామన్నారు. అయితే మిగిలిన కేసుల్లో చెల్లింపులు ఎందుకు జరగలేదో వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆర్టికల్‌ 162ను వక్రీకరించడాన్ని తప్పుబట్టారు. ఇది కేవలం సాధారణ తప్పిదం కాదన్నారు. ఏఏజీ స్పందిస్తూ ఆర్టికల్‌ 162ను తప్పుగా రాశారని అంగీకరించారు. ఇది తప్పిదమని.. సరిచేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మీకులు, పెన్షనర్లు ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రాన్ని పిటిషనర్‌ విజయ్‌గోపాల్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రెండో పీఆర్సీ అమలు కాలేదని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఏఏజీ జోక్యం చేసుకొని ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు సంబంధం లేదన్నారు. ప్రభుత్వం రూ. 5 కోట్ల బిల్లు చెల్లించకపోవడంతో ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనను పిటిషనర్‌ ప్రస్తావించగా న్యాయమూర్తి జోక్యం చేసుకొని దీనికి ఈ కేసుతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ వేదికగా కోర్టులను చేసుకోవద్దని.. పథకానికి, పారీ్టలకు సంబంధం లేదన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలేమైనా తీసుకుందా అనే అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. భూనిర్వాసితుల పరిహారం, రాష్ట్ర అప్పుల పరిస్థితి, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలను అందులో పేర్కొనాలన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement