'మిషన్ K-100' విజయవంతంగా 50 రోజులు పూర్తి | Telangana Govt Mission K 100 Completes 50 Days Successfully | Sakshi
Sakshi News home page

'మిషన్ K-100' విజయవంతంగా 50 రోజులు పూర్తి

Aug 21 2026 12:21 AM | Updated on Aug 21 2026 12:21 AM

Telangana Govt Mission K 100 Completes 50 Days Successfully

హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక 'మిషన్ K-100' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. రాబోయే ఖరీఫ్ (2026-27) సీజన్ కంటే ముందే పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ తరలింపు, గోదాముల ఖాళీ చేయడం, నిధుల సమీకరణలో ఈ శాఖ కీలక విజయాలు సాధించింది. సివిల్ సప్లైస్ భవన్‌లో కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర (IPS) అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో, అన్ని జిల్లాల్లోని వారపు డెలివరీ రేట్లు, అధికారుల సన్నద్ధతని సమీక్షించారు.

50 రోజుల్లో రికార్డు డెలివరీ
మిషన్ K-100 ప్రారంభించిన ఈ 50 రోజుల్లో, పౌర సరఫరాల శాఖ మొత్తం 11.17 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) సీఎంఆర్ డెలివరీ సాధించింది. ఇందులో మొదటి వారం నుంచి ఆరో వారం వరకు నిర్దేశించిన లక్ష్యాలకుగాను 8.34 LMT డెలివరీ చేశారు. అంటే వారపు లక్ష్యాలలో 74 శాతం అద్భుతమైన పురోగతిని సాధించారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్ల గతంలో పనిచేయని 340 మిల్లులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డెలివరీ చేయని మిల్లుల సంఖ్య 1,351 నుంచి 1,011కి తగ్గింది.

నిధుల సమీకరణ - గోదాముల ఖాళీ:
రాబోయే ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, కార్పొరేషన్ అవసరమైన నిధులను సమీకరించి తమ లక్ష్యంలో 75 శాతం సాధించింది. దీనికి తోడు రాబోయే సీజన్ కోసం గోదాముల్లో సరిపడా ఖాళీలు ఉంచేందుకు, మిగిలిపోయిన ధాన్యాన్ని దశలవారీగా వేలం వేసే ప్రక్రియ కూడా సాఫీగా సాగుతోంది.

మిల్లర్లకు చివరి అవకాశం (G.O.Ms.No.9):
ప్రస్తుత పనులకు ఆటంకం కలగకుండా పాత బకాయిలు రాబట్టడానికి, ప్రభుత్వం G.O.Ms.No.9 తీసుకొచ్చింది. దీని ద్వారా రబీ 2022-23లో వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించడానికి మిల్లర్లకు చివరి అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 31, 2026 నాటికి మూడు వాయిదాలలో ఈ బకాయిలు చెల్లించాలి. ఈ గడువు దాటితే వారిని 'డిఫాల్టర్‌'గా ప్రకటించి, 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీ కూడా వసూలు చేస్తామని పౌర సరఫరాల శాఖ తీవ్రంగా హెచ్చరించింది.

డిఫాల్టర్లపై కఠిన చర్యలు - పీడీ యాక్ట్ ప్రయోగం:
విజిలెన్స్ బృందాలు చురుగ్గా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ, బకాయిలు చెల్లించని వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు, రెవెన్యూ రికవరీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా డిఫాల్టర్ల ఆస్తులను జప్తు చేయడం, వారి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా తమ వద్దే ఉంచుకున్న వారిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ఇలాంటి మిల్లర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కఠిన చర్యల వల్ల, ఆగస్టు 19, 2026 నాటికి వేలం వేసిన ధాన్యం రికవరీ ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ. 1,000.57 కోట్లు వసూలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement