సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో అక్రమంగా జరిగిన అధ్యాపకుల నియామకాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ (అకడమిక్ కన్సల్టెంట్ల అసోసియేషన్) 2013 ఫిబ్రవరి 22న దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. తక్షణమే కొత్త నోటిఫికేషన్ జారీ చేసుకోవచ్చని వర్సిటీకి స్పష్టం చేసింది.
2012లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో చేర్చకూడని పోస్టులు చేర్చడం, చేర్చాల్సిన పోస్టులు వదిలేయడంతో సంబంధిత సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోవడాన్ని సవాల్ చేస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పునిచ్చారు. నోటిఫికేషన్ ప్రకారం 53 మంది అధ్యాపకులను నియమించగా వారిలో ప్రస్తుతం 45 మంది పనిచేస్తున్నారు.
ఈసీ ఆమోదం లేకుండానే..
2006లో స్థాపించిన వర్సిటీలో జీవో 420 ప్రకారం ఆర్ట్స్, సైన్స్ గ్రూపులను వేరుగా తీసుకొని ప్రతి గ్రూప్‌లోని సబ్జెక్టులను అక్షర క్రమంలో పెట్టి అన్ని పోస్టులకూ ఒకే రన్నింగ్ రోస్టర్ వర్తింపజేయాల్సి ఉంది. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు వేర్వేరు రోస్టర్ నిర్వహించడం అసాధ్యం కావడంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. అయితే వర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదం తీసుకోవాలి. ఈ క్రమంలో 20వ పాలకమండలి 2012 ఏప్రిల్ 27న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిలిపివేసి వాటి స్థానంలో రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఇంటిగ్రేటెడ్ కోర్సులకు వర్సిటీ రెగ్యులర్ స్టాఫ్‌ను తీసుకోలేదు. ఎక్కువగా తాత్కాలిక కన్సల్టెంట్లతో క్లాసులు నిర్వహించింది. దీంతో ఈ మార్పుల తర్వాత పోస్టుల లెక్కలు, రోస్టర్ పాయింట్లు మళ్లీ పరిగణనలోకి తీసుకొని పాలకమండలిలో పెట్టాలి. కానీ దీన్ని వర్సిటీ పాటించలేదు. అలాగే రెండేళ్ల కోర్సులకు ప్యాటర్న్ 1:2:4 (ప్రొఫెసర్:అసోసియేట్:అసిస్టెంట్), ఇంటిగ్రేటెడ్ కోర్సులకు 1:3:7 విధానం పాటించాలి. అయితే అప్‌లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిలిపివేసిన తర్వాత వాటికి 1:3:7 ప్యాటర్న్ వర్తించదు. కానీ నోటిఫికేషన్‌లో వాటిని ఐదేళ్ల కోర్సుల్లాగే వర్సిటీ చూపించింది. అక్షర క్రమంలో అప్‌లైడ్ ఎకనామిక్స్ ‘అ’తో మొదలవుతుందని గ్రూప్ టాప్‌లో పెట్టారు. ఈ కారణంగా ఇతర సబ్జెక్టుల రోస్టర్ మొత్తం మారిపోయింది.
కోర్సు నిలిపివేసినా పోస్టులు చూపి..
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీని కూడా నిలిపివేసినప్పటికీ 1:3:7 ప్యాటర్న్ ప్రకారం వర్సిటీ ఎక్కువ పోస్టులు చూపించింది. దీంతో ఫిజిక్స్ లాంటి తరువాతి సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోయాయి. అదేవిధంగా బోటనీ డిపార్ట్‌మెంట్‌లో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2012 మే 6న మరణించినా ఆ ఖాళీని నోటిఫికేషన్‌లో చేర్చలేదు. దీంతో ఇది కూడా రోస్టర్‌ను మార్చేసింది. 2012 ఏప్రిల్ 27న పాలక మండలి రెండు ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ నోటిఫికేషన్ మాత్రం 2012 మే 25న వచి్చంది. దీనిప్రకారం నోటిఫికేషన్ వచి్చన తేదీన ఆ రెండు కోర్సులు అమల్లో లేవు. దీంతో మనుగడలో లేని కోర్సులకు పోస్టులను చూపించి తప్పుదోవ పట్టించడంతో ఇది రోస్టర్ పాయింట్లను నేరుగా ప్రభావితం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. 2012 నోటిఫికేషన్ చెల్లదని స్పష్టం చేసింది. ఆ నోటిపికేషన్ మేర కు చేసిన నియామకాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.


