యుద్ధ వికలాంగుడికి ఇంటి స్థలంపై నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: 1971 ఇండో–పాక్ యుద్ధంలో గాయపడి వికలాంగుడైన మాజీ సైనికుడు సీతారామరాజుకు ఇంటి స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుల సేవలు ప్రాంతీయ సరిహద్దులను మించినవని పేర్కొంది. జన్మస్థలం ఆధారంగా స్థలం నిరాకరించడం చెల్లదని స్పష్టం చేస్తూ, రంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన మెమోను కొట్టివేసింది.
1993లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం యుద్ధ వీర వితంతువులు, వికలాంగ మాజీ సైనికులకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినా, అధికారుల నిర్లక్ష్యంతో సీతారామరాజుకు స్థలం ఇవ్వలేదని అభిప్రాయపడింది. 2005లో వచ్చిన జీవో ప్రకారం 300 చదరపు గజాల స్థలం ఇవ్వాల్సిన అర్హత అతనికి ఉందని పేర్కొంది. సీతారామరాజుకు తెలంగాణలోని ఏదైనా మున్సిపల్ ప్రాంతంలో ఆ మేరకు స్థలం కేటాయించే అంశాన్ని 3 నెలల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లాలో ఇంటి స్థలం ఇచ్చేందుకు కలెక్టర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సీతారామరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కావడంతో తెలంగాణలో ఇంటి స్థలం ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పిటిషనర్ 1975 నుంచే హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు సైనిక్ వెల్ఫేర్ అధికారుల ధ్రువీకరణ ఉందని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


