భాగ్య ‘నరకం’ | Heavy Rain In Hyderabad | Sakshi
Sakshi News home page

భాగ్య ‘నరకం’

Jun 13 2026 12:34 AM | Updated on Jun 13 2026 12:34 AM

Heavy Rain In Hyderabad

చినుకు.. ఈసారి మరింత వణుకు

నగరంలో కొత్తగా రోడ్డెక్కిన వాహనాలు 5.35 లక్షలు 

ఏడాది కాలంలో మరింత విస్తరించిన జనావాసాలు 

కుంచించుకుపోయిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ 

గతేడాది 18 మార్లు ట్రాఫిక్‌ను అస్తవ్యస్తం చేసిన వర్షాలు  

ఆరుసార్లు గ్రిడ్‌లాక్‌ దుస్థితి 

ఈసారి అదే స్థాయి వానలు కురిస్తే పరిస్థితి చేయిదాటే ప్రమాదం

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం వచ్చేసింది.. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగింది..కానీ, హైదరాబాద్‌ నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి. చినుకు రాలితే వణికిపోతోంది. గతేడాది భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కానీ, అదేస్థాయి వానలు ఈసారి కురిస్తే అంతకంటే ఎక్కువ ఆగమాగమయ్యే పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం. నగరంలో ఏదైనా సమస్య నెలకొంటే ముందుగా అటువైపు వాహనాలను నియంత్రిస్తారు, లేకుంటే ఆ రూట్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంటుంది.

గత ఏడాది భారీ వర్షాలు, భయంకర ట్రాఫిక్‌ జామ్‌లను సృష్టించిన ప్రాంతాల్లో కొత్తగా వేల సంఖ్యలో వాహనాలు వచ్చి చేరుతున్నాయి. అందుకే నగరం ఇప్పుడు వణికిపోతోంది. పైగా నగరం మరింత విస్తరించింది..కొత్త జనావాసాలు వెలిశాయి. ఇతర జిల్లాలు, ఏపీ నుంచి నగరానికి వచ్చే వాహనాల సంఖ్యా పెరిగింది. రోడ్లు మరింత కుంచించుకుపోయాయి.. అదనంగా ప్రత్యామ్నాయ దారులేవీ అందుబాటులోకి రాలేదు. అందుకే ఇప్పుడు నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి.  

వాహన వరద.. నాలుగో స్థానంలో హైదరాబాద్‌  
దేశంలో ఎక్కువ వాహనాలు అమ్ముడవుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. గత వానాకాలం ముగిసిన తర్వాత నగరంలో ఏకంగా 5,35 లక్షల వాహనాలు రోడ్డెకెక్కాయి. దీంతో నగరంలో మొత్తం వాహనాల సంఖ్య 90 లక్షలకు చేరువైంది. ఇప్పుడు ఇదే భాగ్యనగర గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గతేడాది నాటికి ఉన్న వాహనాలకు తగ్గ రోడ్డు నెట్‌వర్క్‌ హైదరాబాద్‌కు లేదు. వాణిజ్య ప్రాంతాల విస్తరణ మీద నగరంలో ఎక్కడా నియంత్రణ లేదు. వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చే విషయంలో ప్రణాళిక అంటూ లేని దుస్థితి.

ఆయా ప్రాంతాలో పార్కింగ్‌ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. ఈ తరుణంలో కొత్తగా లక్షల వాహనాలు రోడ్డెక్కితే పరిస్థితి భయంకరంగా మారబోతోంది. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే చాలా ప్రాంతాల్లో గంటలతరబడి ట్రాఫిక్‌లో బంధీ కావాల్సిందే. ఈనెల 9న భారీ వర్షంతో ఈసారి తొలకరి పలకరించింది. నాలెడ్జి సిటీ, కొండాపూర్, ఐకియా జంక్షన్, మాదాపూర్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రాయదుర్గం, మెహిదీపట్నం, సచివాలయం, ముషీరాబాద్, పాతనగరం... ఇలా ప్రధాన ప్రాంతాలు సాయంత్రం మూడు గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. కేవలం 4–5 సెంటీమీటర్ల మేర కురిసిన ఈ వాన 30 శాతం నగరాన్ని ట్రాఫిక్‌ పద్మవ్యూహంలోకి నెట్టేసింది. మరి వరుస పెట్టి 10 సెం.మీ. మేర వాన కురిస్తే నగరం రోజు మొత్తం స్తంభించాల్సిందే.  

గతేడాది అనుభవాలేంటి..? 
గత సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. కేవలం గంట సమయంలోనే 10 సెం.మీ. వాన కురిసిన దాఖలాలు ఉండటంతో మెరుపు వరదలు సంభవించాయి. గత సీజన్‌లో మొత్తం 18 మార్లు నగరం ట్రాఫిక్‌లో బంధీ కాగా, అరడజను పర్యాయాలు గ్రిడ్‌లాక్‌ పరిస్థితి నెలకొంది. యావత్‌ నగరం గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లతో నరకం అనుభవించాల్సి వచ్చింది.  

ఏప్రిల్‌ 3–4,(ప్రీ–మాన్సూన్‌): జడివాన బీభత్సం సృష్టించింది. గంటపాటు కురిసి భారీ వృక్షాలను కూడా కూకటి వేళ్లతో పెకిలించేసింది. ఫలితం నగరం మొత్తం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.  

ఆగస్టు మొదటి రెండు వారాల్లో ఆరు భారీ వర్షాలు కురిశాయి. వానలు నగరాన్ని ముంచెత్తాయి. ప్రధాన రోడ్లు చెరువుల్లా మారి గంటలపాటు వాహనాలు నిలిచిపోవాల్సి వచ్చింది.  
సెప్టెంబర్ 17 రాత్రి కురిసిన వాన రోడ్లను ముంచెత్తింది. ప్రాణనష్టం కూడా నెలకొంది. సెప్టెంబర్‌ 22న గంట పాటు ఏకబిగిన కురిసిన వానలు నగరం మొత్తాన్ని స్తంభింపజేశాయి.  
తుఫాను ప్రభావంతో అక్టోబర్‌ 29న కురిసిన కుండపోత పీక్‌ గ్రిడ్‌లాక్‌గా నిలిచింది.  

ఐటీ కారిడార్‌లో మితిమీరిన కేంద్రీకరణ  
మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, మైండ్‌స్పేస్‌ జంక్షన్, కోకాపేట లాంటి ఆధునిక హైదరాబాద్‌ ప్రాంతాల్లో అతి భారీ భవన సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సగటున ఇంటికి రెండు కార్లున్నాయని తేలింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అలాంటి సమయంలో వర్షం కురిస్తే పరిస్థితి బీభత్సంగా మారుతోంది. ఈ ఏడాది తొలి వాన ఈ ప్రాంతాలను ఆగమాగం చేసింది.  

అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ  
ఫ్లైఓవర్లను నిర్మించే దిశగా జరిగిన ఆలోచనలో పదో వంతు కూడా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విషయంలో లేకపోవటమే అతి పెద్ద సమస్య. నగరంలో రెండుమూడు సెం.మీ. వానను తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అంతకుమించి ఒక్క చినుకు రాలినా అతలాకుతలమే. భారీ నిర్మాణాలకు అనుమతిచ్చే ముందే ఆ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే వ్యూహం ప్రభుత్వం వద్ద లేదు.  

ఇలా చేస్తే కొంత మెరుగు  
ఆఫీస్‌ వేళల్లో మార్పులు : ఐటీ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆఫీసులు అన్నీ ఒకే సమయానికి కాకుండా, గంట, రెండు గంటల వ్యవధితో విడతల వారీగా లీవ్‌/లాగిన్‌ టైమింగ్స్‌ పెట్టాలి. 
⇒  కార్‌ పూలింగ్‌ –ప్రజా రవాణా: ఒక్కరే కారులో వెళ్లకుండా నలుగురు కలిసి ‘కార్‌ పూలింగ్‌’చేయడం ఇలాంటి సందర్భంలో చాలా ఉపయోగం, ఇక సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లను ఆశ్రయించే అలవాటు పెంచుకోవాల్సిందే.  

నీరు నిలిచే ప్రాంతాల గుర్తింపు: నగరంలో నీరు నిలిచే 350కి పైగా ప్రధాన ప్రాంతాల్లో అత్యాధునిక మోటార్లు ఉంచి, çవరద నీటిని నాలాల్లోకి పంప్‌ చేయాలి. 
హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీస్‌ ఉమ్మడి కార్యాచరణ: వర్షం పడగానే రంగంలోకి దిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని జంక్షన్లలో మోహరించాలి.  

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌: భారీ వర్ష సూచనలు అందిన సమయాల్లో ఎక్కువ మంది ఉద్యోగులుండే ఐటీ కంపెనీలకు ముందే సమాచారం ఇచ్చి ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ప్రకటించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. 

రోడ్లపై గుంతల పూడ్చివేత: వీలైనంత తొందరగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలి. అక్రమ పార్కింగులను నియంత్రించాలి. రోడ్డు ఆక్రమణలు తొలగించాలి.  
రోడ్లపై ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు విసరొద్దు.. అవి డ్రైనేజీ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వరద నీళ్లు వేగంగా పారకుండా అడ్డుకుంటున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement